హీరో నాని విన్నపంపై రేవంత్ రెడ్డి స్పందన
- నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న 'ది ప్యారడైజ్'
- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్‌లో సినిమా చూసేందుకు అనుమతివ్వాలని సీఎంను కోరిన నాని
- స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల సందర్భంగా... హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో వీక్షించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. భద్రతా నిబంధనలు, అధికారిక ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటిస్తామని, ప్రజా భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని తెలిపారు.
నాని చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఎక్స్‌లో స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ విన్నవించినందుకు నానికి అభినందనలు తెలిపిన సీఎం... యువ తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను ప్రశంసించారు. అయితే, జనసమూహ నియంత్రణ, ప్రజల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ విషయమై అధికారికంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పోలీసు అధికారులు శాంతిభద్రతల పరిస్థితులను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.