వాట్సప్‌లో గంట సేపు సాంకేతిక లోపం... మెసేజ్‌లు సెండ్‌ కాని వైనం

15-07-2020 Wed 09:40
  • గత రాత్రి ఒంటి గంట సమయంలో సమస్య
  • 200 కోట్ల మంది యూజర్లందరి ఫోన్లలో పనిచేయని యాప్
  • సాంకేతిక సమస్యను పరిష్కరించిన సిబ్బంది
  • ఓ ఇంటర్నల్‌ అప్‌డేట్‌ కారణంగా సమస్య తలెత్తిందన్న వాట్సప్
WhatsApp went down for nearly an hour

వాట్సప్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా భారత కాలమాన ప్రకారం గత రాత్రి ఒంటి గంట నుంచి దాదాపు గంట సేపు ఆ యాప్‌ పని చేయలేదు. ఆ సమయంలో ఆ యాప్‌ను వాడడానికి ప్రయత్నించిన యూజర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

పర్యవసానంగా 200 కోట్ల మంది యూజర్ల మొబైల్ ఫోన్లలో వాట్సప్‌ పని చేయలేదు. అనంతరం వాట్సప్ సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించి, సర్వీసును తిరిగి పునరుద్ధరించారు. ఈ సాంకేతిక సమస్య వల్ల దాదాపు గంట సేపు వాట్సప్‌ యూజర్లు సందేశాలు పంపలేకపోయారు, అలాగే రిసీవ్ చేసుకోలేకపోయారు.

ఆ సమయంలో వాట్సప్‌ యాప్‌ ఓపెన్‌ అయి.. పాత మెసేజ్‌లు కనపడినప్పటికీ, కొత్తవి పంపలేకపోయారని నిపుణులు వివరించారు. ప్రస్తుతం తిరిగి వాట్సప్‌లో ఎప్పటిలాగే సేవలు కొనసాగుతున్నాయి. వాట్సప్‌లో ఓ ఇంటర్నల్‌ అప్‌డేట్‌ కారణంగా ఈ రోజు తెల్లవారుజామున యూజర్లకు ఈ అసౌకర్యం  కలిగిందని వాట్సప్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

తాము ఈ సమస్యను వెంటనే పరిష్కరించామని, యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. వాట్సప్‌లో ఇటువంటి లోపాలు తలెత్తడం చాలా అరుదు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఇటువంటి లోపం తలెత్తింది. ఈ రోజు తెల్లవారు జామున వాట్సప్‌లో తలెత్తిన ఈ లోపం కారణంగా ముఖ్యంగా అమెరికా, యూకేల్లో యూజర్లు చాలా సేపు అసౌకర్యానికి గురయ్యారు.