వాళ్లిద్దరూ ప్రపంచ కప్‌ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటోంది: రింకూ సింగ్‌

వాళ్లిద్దరూ ప్రపంచ కప్‌ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటోంది: రింకూ సింగ్‌

Rinku Singh says whole country wants Virat Kohli and Rohit Sharma to win World Cup
  • 2027 ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్‌ ఆడాలని రింకూ ఆకాంక్ష
  • ఇద్దరూ భారత్‌ను ప్రపంచకప్‌ గెలిపించాలని కోరుకున్న బ్యాటర్‌
  • తనను ఐదు సిక్సర్లతో గుర్తించొద్దన్న రింకూ
  • ప్రపంచకప్‌ విజయాల్లో భాగం కావడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
  • టెస్టుల్లోనూ భారత్‌కు ఆడాలన్నది తన కల అని వెల్లడి
విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ఆడాలని దేశం మొత్తం కోరుకుంటోందని టీమిండియా బ్యాటర్‌ రింకూ సింగ్‌ అన్నాడు. ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లని పేర్కొన్న అతడు.. 2027 ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిస్తే అది దేశానికే కాకుండా కోహ్లీ, రోహిత్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైన సందర్భమవుతుందని చెప్పాడు.

‘‘విరాట్‌ భయ్యా, రోహిత్‌ భయ్యా ఇద్దరూ లెజెండ్స్‌. వాళ్లు ప్రపంచకప్‌లో ఆడాలని నా ఒక్కడి కోరిక కాదు.. దేశం మొత్తం కోరుకుంటోంది. వాళ్లు జట్టులో ఉండి భారత్‌ను ప్రపంచకప్‌ విజేతగా నిలిపితే ఎంతో గొప్పగా ఉంటుంది. అది వాళ్లకు చివరి ప్రపంచకప్‌ కావచ్చేమో. 2011 తర్వాత భారత్‌ వన్డే ప్రపంచకప్‌ గెలవలేదు. అందుకే వాళ్లిద్దరూ జట్టుతో ఉండి ట్రోఫీ గెలిస్తే ఎంతో ప్రత్యేకం’’ అని జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ చెప్పాడు.

ఐపీఎల్‌ 2023లో గుజరాత్‌ టైటాన్స్‌పై వరుసగా ఐదు సిక్సర్లు బాదడంతో రింకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తనను కేవలం ఆ ఐదు సిక్సర్లతోనే గుర్తించకూడదని అతడు అంటున్నాడు. భారత్‌ తరఫున ప్రపంచకప్‌ గెలవడంలో భాగస్వామి కావడమే ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యమని చెప్పాడు. బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడుతూ మరిన్ని ప్రపంచకప్‌ విజయాల్లో భాగం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

ఇక తాను కేవలం టీ20 ఆటగాడిననే అభిప్రాయాన్ని కూడా రింకూ ఖండించాడు. దేశవాళీ క్రికెట్‌లో వన్డేలు, నాలుగు రోజుల మ్యాచుల్లోనూ ఆడుతున్నానని చెప్పాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్నది తన కల అని వెల్లడించాడు. ప్రస్తుతం భారత్‌ తరఫున ఒక్క ఫార్మాట్‌లోనే ఆడుతున్నా.. మూడు ఫార్మాట్లలోనూ రాణించగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు.

కెప్టెన్సీపై కూడా రింకూ స్పందించాడు. యూపీ లీగ్‌లో తన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్‌ గెలిచానని గుర్తుచేశాడు. గత సీజన్‌లో ఐపీఎల్‌లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్నానని చెప్పాడు. అజింక్య రహానె, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్ల నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్సీలో ఇంకా ఎదగాల్సి ఉందని పేర్కొన్నాడు.
Advertisement
Rinku Singh
Virat Kohli
Rohit Sharma
2027 ODI World Cup
Team India
Test Cricket Debut

More Telugu News