పోటీ చేయమని కోరినందుకు కృతఙ్ఞతలు.. కానీ క్షమించండి: మంత్రి జగదీశ్ రెడ్డి భార్య సునీత ప్రకటన

  • పోటీ చేయమని కోరిన అభిమానులు, నాయకులు
  • మా పిల్లల చదువు దృష్ట్యా పోటీ చేయడం లేదు
  • పేద పిల్లలకు సేవలు కొనసాగిస్తానన్న మంత్రి భార్య  
తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రోజుతో నామినేషన్లు దాఖలు చేయడం ముగిసింది. ఇదిలా ఉండగా, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి భార్య సునీతను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతూ టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు పోలా రాధాకృష్ణ పేరిట కరపత్రాలను పంచారు.

సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో సునీతను బరిలోకి దింపితే బాగుంటుందని ఆమె అభిమానులు, నాయకులు కోరుకున్నారు. ఈ విషయం స్థానికంగా ఆసక్తి రేకెత్తించడమే కాక, సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సునీత స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో తనను పోటీ చేయాలని కోరుతూ తనపై అభిమానం చూపించిన వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. 'అయితే, మీ కోరికను మన్నించలేకపోయినందుకు క్షమించాల్సిందిగా విఙ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆ ప్రకటనలో తెలిపారు. తన పిల్లల చదువు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ‘యస్ ఫౌండేషన్’ ద్వారా పేద పిల్లలకు అందిస్తున్న సేవలను ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు.
Go Back to Shorts
Suryapet District
Muncipal Elections
Minister
G Jagadish Reddy
wife
Sunitha
S Foundation

More Telugu News