మోదీ చోర్ అన్న రాహుల్ గాంధీ.. నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు!
- మోదీ దొంగని సుప్రీంకోర్టు చెప్పిందన్న రాహుల్
- కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ధిక్కార పిటిషన్
- ఈ నెల 22లోపు స్పందించాలంటూ సుప్రీం నోటీసులు
ఫ్రాన్స్ తో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు రాహుల్ గాంధీ గత కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రాఫెల్ పత్రాల ఆధారంగా గతంలో రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది.
దీనిపై హర్షం వ్యక్తం చేసిన రాహుల్.. సుప్రీంకోర్టు నిర్ణయంతో నైతిక విజయాన్ని సాధించామని అన్నారు. చౌకీదార్ చోర్ (మోదీ దొంగ) అని సుప్రీంకోర్టే చెప్పిందని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో రాఫెల్ ఒప్పందంలో ఏదో తప్పు ఉందని తేటతెల్లమయిందన్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కోర్టు ధిక్కారానికి రాహుల్ పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు.