Krishna District: కృష్ణా జిల్లాలో పోలీసులకు డబ్బు కవర్లు ఇవ్వడానికి ప్రయత్నం.. వైసీపీ నేత అనుచరుడిపై ఆరోపణలు!
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో డబ్బు కవర్ల కలకలం చోటుచేసుకుంది. వైసీపీ నేత పోలీసులకు నగదు ఇవ్వజూపారంటూ ఆరోపణలు తలెత్తాయి. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లకు నగదు కవర్లతో ఓ వైసీపీ నేత వెళ్లినట్టు ఆరోపణలు. ఆ నగదు కవర్లను తిరస్కరించిన పోలీస్ అధికారులు తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నగదు తీసుకెళ్లిన నేత మాగంటి వెంకట రామారావుగా గురించారు. మైలవరం వైసీపీ నేత కృష్ణ ప్రసాద్ ఈ నగదు పంపారని ఆయన అనుచరుడు రామారావు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వెంకట రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఎన్నికల సమయంలో తమకు సహకరించాలని వెంకటరామారావు ఈ నగదును వారికి ఇవ్వజూపారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.