ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్... బీజేపీ కంచుకోట నుంచి పోటీ
- బీహార్ బంకిపుర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీకి దిగుతున్న ప్రశాంత్ కిశోర్
- దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఇది
- కిశోర్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఆర్జేడీ నిర్ణయంపై ఉత్కంఠ
- జులై 30న పోలింగ్, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు
గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. బంకిపుర్ స్థానంలో బీజేపీ దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తోంది.
ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, పార్టీ పూర్తి విశ్వాసంతో, శక్తియుక్తులతో ఈ ఉపఎన్నికలో పోరాడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఈ విజయమే పునాది వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "గత నాలుగేళ్లుగా జన్ సురాజ్ నా జీవితంగా మారింది.
బీహార్‌లో మార్పు లక్ష్యం నెరవేరే వరకు ఇదే నా ధ్యేయం. బంకిపుర్ ఉపఎన్నికలో పోటీ చేసే బాధ్యతను ఆ లక్ష్యం దిశగా ఒక అడుగుగా భావిస్తున్నాను" అని కిశోర్ తెలిపారు. తనపై నమ్మకముంచిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బంకిపుర్ ఉపఎన్నికకు జులై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో కిశోర్‌కు మద్దతిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టే ప్రయత్నంలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కూడా పీకేకు మద్దతు ఇస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.