మేం కష్టపడి ప్రాజెక్టులు తీసుకువస్తే, తామే తెచ్చినట్టు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు: సీఎం చంద్రబాబు
- కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
- మీడియా ప్రతినిధులతో చిట్ చాట్
- రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టడమే వైసీపీ పని అంటూ విమర్శలు
- కూటమి తెచ్చిన ప్రాజెక్టులకు క్రెడిట్ కొట్టేస్తున్నారని ఆగ్రహం
- తమపై దుష్ప్రచారానికి సోషల్ మీడియాకు ఫండింగ్ చేస్తున్నారని ఆరోపణలు
తనపైనా, పవన్ కల్యాణ్ పైనా నిరంతరం దుష్ప్రచారం చేసేందుకు కొన్ని సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ నేతలు ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. హింస, అసభ్యత, వర్గవిభేదాలు, రౌడీయిజం వంటి వాటినే ఆ పార్టీ నమ్ముకుందని, వారి అడ్డంకులు ఎన్ని ఎదురైనా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు.
కుప్పం నియోజకవర్గానికి మునుపెన్నడూ చూడని రీతిలో ప్రాజెక్టులు వస్తున్నాయని, రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లో కనెక్టివిటీ పెంచుతున్నామని తెలిపారు. త్వరలోనే అభివృద్ధి చెందిన సరికొత్త కుప్పాన్ని ప్రజలు చూస్తారని భరోసా ఇచ్చారు. వికేంద్రీకృత అభివృద్ధి విధానంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్రానికి క్వాంటం, సెమీ కండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో 'క్వాంటం కంప్యూటింగ్ సెంటర్' కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఇంధన రంగంలో సౌర, పవన విద్యుత్‌తో పాటు ఇతర అత్యాధునిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. దేశంలోని ప్రముఖ ఉక్కు పరిశ్రమలైన ఆర్సెలర్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థలు ఏపీలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని గుర్తుచేశారు. పరిశ్రమలతో పాటు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
గత పాలకులు విలువైన భూములు, ఖనిజ సంపదను ఒకే వ్యక్తి ప్రయోజనం కోసం కట్టబెట్టారని, ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగుకు కేంద్రంగా మార్చారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని, అలాంటి వారు ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.