వివాదాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. రాంగోపాల్ వర్మపై కేసులు పెట్టేందుకు టీడీపీ నేతల సన్నాహాలు!
- చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీశారని ఆగ్రహం
- దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఎస్వీ మోహన్ రెడ్డి
- చంద్రబాబును డైరెక్ట్ గా ఎదుర్కోవాలని సవాల్
ఈ విషయమై టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెన్నుపోటు పాటలో చంద్రబాబును అనుచితంగా చూపారని మండిపడ్డారు. చంద్రబాబు ఫొటోలను వాడుకుని ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వర్మతో పాటు ఇతర చిత్ర యూనిట్ పై పరువు నష్టంతో పాటు క్రిమినల్ అభియోగాల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
వర్మ ఒక్కడే ఈ పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదనీ, వెనుక ఉండి శిఖండి రాజకీయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. దమ్ముంటే సదరు నేతలు ముందుకొచ్చి చంద్రబాబును ఎదుర్కోవాలని సవాలు విసిరారు. ఈ వ్యవహారంపై ఏపీ అంతటా టీడీపీ శ్రేణులు కేసులు నమోదు చేస్తాయని హెచ్చరించారు.