Advertisement

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై జగన్ స్పందన

YS Jagan Mohan Reddy reacts to Dharmendra Pradhan resignation
  • నీట్ లీకేజీపై కేంద్ర మంత్రి రాజీనామా చేశారని జగన్ వ్యాఖ్య
  • డీఎస్సీ అక్రమాలకు బాధ్యతగా లోకేశ్ కూడా వైదొలగాలని డిమాండ్
  • ఎన్డీఏ ప్రమాణాలను ఏపీలోనూ పాటించాలని సూచన
  • కొడుకును కాపాడుకుంటారా అంటూ సీఎంకు జగన్ ప్రశ్న
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని, ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనానికి నిదర్శనమని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. ఇదే నైతికతను ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రదర్శించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్ష నిర్వహణలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. "దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేస్తారా?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని కూడా జగన్ ప్రశ్నించారు. "ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం చంద్రబాబు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?" అని నిలదీశారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ పాటిస్తున్న ప్రమాణాలను రాష్ట్రంలో ఎందుకు విస్మరిస్తున్నారని జగన్ తన పోస్టులో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Nara Lokesh
Dharmendra Pradhan
AP DSC Exam
NEET Paper Leak
Andhra Pradesh Politics

More Telugu News