ప్రపంచ సుందరిగా మెక్సికో భామ వెనెస్సా
- చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలు
- తొలిసారి ఓ మెక్సికన్‌కు ప్రపంచ సుందరి కిరీటం
- నిరాశ పరిచిన భారత భామ అనుకీర్తి వ్యాస్
న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు అద్భుతంగా సమాధానాలు చెప్పిన వెనెస్సా వారి హృదయాలను గెలుచుకుంది. ప్రపంచ సుందరిగా ఇతరుల కోసం మీ స్థాయిని ఎలా ఉపయోగిస్తారన్న ప్రశ్నకు వెనెస్సా చెప్పిన సమాధానానికి న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. మిస్ వరల్డ్‌గా ఎంపికైన వెనెస్సాకు గతేడాది ప్రపంచ సుందరిగా నిలిచిన మానుషి చిల్లార్ కిరీటాన్ని తొడిగి అభినందించింది.
ఈ ఏడాది మొత్తం 118 మంది ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడగా అందరినీ ఓడించి వెనెస్సా విజయం సొంతం చేసుకుంది. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన అనుకీర్తి వ్యాస్ 19వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డిగ్రీ పూర్తి చేసిన వెనెస్సా ప్రస్తుతం మోడల్‌గా, ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది. సామాజిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటోంది. కాగా, ఓ మెక్సికన్‌కు ప్రపంచ సుందరి కిరీటం దక్కడం ఇదే తొలిసారి కావడంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. థాయ్‌లాండ్‌కు చెందిన నికోలెనె లిమ్స్‌నుకన్ రన్నరప్‌గా నిలిచింది.