తన నివాసంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు దాడి చేశారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ  సంచలన ఆరోపణలు చేశారు. కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న తన ఇంటిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ దాడికి పాల్పడ్డారని, తనను హత్య చేసేందుకే ఈ ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు.

శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన ఇంటి బయట 'దొంగ' అంటూ నినాదాలు చేయడంతో ఘర్షణ మొదలైందని అభిషేక్ తెలిపారు. బీజేపీ మద్దతుదారులు ఇటుకలు, రాళ్లతో టీఎంసీ కార్యకర్తలపై దాడి చేశారని, ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని చెప్పారు. దాడికి రెండు రోజుల ముందు నుంచే బీజేపీ కార్యకర్తలు తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని, గత ఆరు నెలల్లో తనపై ఇది ఏడో హత్యాయత్నం అని ఆయన 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. "దాడి చేసిన వారిలో కొందరి వద్ద రివాల్వర్లు ఉన్నాయి. నన్ను చంపాలనే ఉద్దేశంతోనే వారు ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడ్డారు" అని ఆయన ఆరోపించారు.

ఈ దాడిలో ఒక సహోద్యోగి బొటనవేలికి తీవ్ర గాయమైందని, ప్లాస్టిక్ సర్జరీ అవసరం కావచ్చని తెలిపారు. మరొకరికి కంటి కింద ఎముక విరిగిందని వివరించారు. ఈ హింస పోలీసుల సమక్షంలోనే జరిగినా వారు జోక్యం చేసుకోలేదని ఆరోపించారు. కోల్‌కతా పోలీసులు, కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో జూన్ 19న సోనాపూర్‌లో తనపై హత్యాయత్నం జరిగిందని, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.

అయితే, అభిషేక్ బెనర్జీ ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపారేశారు. బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఈ ఘటనను ఒక 'డ్రామా'గా అభివర్ణించారు. ఫుట్‌పాత్‌పై పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే నిరసనలు రావడం సహజమని అన్నారు. అభిషేక్‌కు హాని తలపెట్టే సమయం, ఉద్దేశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. భావోద్వేగపూరిత మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు.

అభిషేక్ బెనర్జీ నివాసం వెలుపల తెల్లవారుజామున 2 గంటల నుంచి 3:30 గంటల మధ్య ఘర్షణలు జరిగాయని పోలీసులు ధ్రువీకరించారు. ఇరువర్గాల వారికి గాయాలైనట్లు నివేదికలు ఉన్నాయని, అయితే దీనికి ఏ రాజకీయ పార్టీ కారణమన్నది ఇంకా నిర్ధారించలేదని తెలిపారు. తన కార్యాలయం, నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిఘా పెట్టారని అభిషేక్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.