ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్‌ ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని తేలింది. యువకుడిని కిరాతకంగా హత్య చేసి బీచ్ ఇసుకలో పాతిపెట్టిన ఘటనలో అతడి ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు పంపారు.

కడలూరు జిల్లా పన్రుట్టి సమీపంలోని సిరువత్తూరు గ్రామానికి చెందిన ఎజిలరసి, చెన్నైలోని నటి రాధిక నివాసంలో గృహ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు ప్రశాంత్ (19) తన మామ రమేశ్‌తో కలిసి టైల్స్ పనులు చేస్తుండేవాడు. అక్టోబర్ 27న చెన్నైలో ఉన్న తన తల్లిని చూసేందుకు వెళ్తున్నానని చెప్పి ప్రశాంత్ బయలుదేరాడు. అయితే ఆ తర్వాత అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పుదుప్పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రశాంత్ సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అతడు చివరిగా తన స్నేహితులైన దేవరాసు (18), దినేష్‌ (23)తో మాట్లాడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. దేవరాసు భార్యతో ప్రశాంత్‌కు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగిందని నిందితులు తెలిపారు. అక్టోబర్ 27 రాత్రి ప్రశాంత్‌ను పులికాట్ సమీపంలోని సతంకుప్పం బీచ్‌కు తీసుకెళ్లి, తీవ్రంగా కొట్టి హత్య చేసి ఇసుకలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు.

నిందితులు ఇచ్చిన సమాచారంతో కడలూరు పోలీసులు తిరుప్పాలైవనం పోలీసుల సహకారంతో శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇసుకలో పాతిపెట్టిన ప్రశాంత్ మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తిరుప్పాలైవనం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.