ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం తన 200 డ్యూక్‌ బైక్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేసింది. క్విక్‌షిఫ్టర్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, రెండు రైడింగ్‌ మోడ్‌లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త మోడల్‌ ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.2,07,140గా నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే ధర కేవలం రూ.1,552 మాత్రమే పెరిగింది.

బైక్‌లోని ప్రధాన మార్పుల్లో బైడైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌ ఒకటి. దీని సాయంతో క్లచ్‌ ఉపయోగించకుండానే గేర్లను పైకి, కిందికి మార్చుకోవచ్చు. రైడ్‌-బై-వైర్‌ టెక్నాలజీ ద్వారా థ్రాటిల్‌ నియంత్రణ మరింత మెరుగవుతుంది. వేగం పెంచే సమయంలో వెనుక చక్రం పట్టును అదుపులో ఉంచేందుకు ట్రాక్షన్‌ కంట్రోల్‌ ఉపయోగపడుతుంది.

కొత్త మోడల్‌లో స్ట్రీట్‌, రెయిన్‌ అనే రెండు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. ట్రాఫిక్‌లో పదేపదే ఆగుతూ ముందుకు వెళ్లే సమయంలో రైడర్‌కు ఇబ్బంది తగ్గించేందుకు క్రాల్‌ అసిస్ట్‌ ఫీచర్‌ను కూడా అందించారు. ఈ ఫీచర్లను టీఎఫ్‌టీ డిస్‌ప్లే ద్వారా నియంత్రించవచ్చు. 

ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 199.5 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 25 బీహెచ్‌పీ శక్తిని, 19.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు భాగంలో 43 ఎంఎం డబ్ల్యూపీ అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్కులు, 320 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌ ఉన్నాయి. వెనుక 150 సెక్షన్‌ టైర్‌ను అందించారు.

రంగుల విషయానికి వస్తే లిక్విడ్‌ కార్బన్‌, స్లేట్‌ గ్రే అనే రెండు కొత్త ఆప్షన్లు వచ్చాయి. లిక్విడ్‌ కార్బన్‌ పూర్తిగా నలుపు రంగులో ఆకట్టుకుంటుంది. కొత్త ఫీచర్లతో బైక్‌ ధర స్వల్పంగా మాత్రమే పెరగడంతో కేటీఎం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.