ప్రీమియం బైక్‌లను ఇష్టపడేవారికి కవాసకి గుడ్‌న్యూస్‌ చెప్పింది. తన పాప్యులర్‌ స్ట్రీట్‌ఫైటర్‌ బైక్‌ జెడ్‌900 కొత్త 2027 మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. గత మోడల్‌తో పోలిస్తే ధర పెంచలేదు. అయితే ఈసారి ఇంజిన్‌ లేదా మెకానికల్‌ ఫీచర్లలో పెద్ద మార్పులు చేయకుండా, కొత్త రంగులపై కంపెనీ దృష్టి పెట్టింది. 

కొత్త కవాసకి జెడ్‌900 రెండు కలర్‌ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి పర్ల్‌ బ్లిజర్డ్‌ వైట్‌/ప్లాస్మా లైమ్‌ గ్రీన్‌, ఎబోనీ/మెటాలిక్‌ కార్బన్‌ గ్రే. బైక్‌ స్పోర్టీ లుక్‌ను ఇష్టపడే వారికి ఈ కొత్త రంగులు ఆకర్షణగా నిలవనున్నాయి. మిగతా డిజైన్‌ మాత్రం గత మోడల్‌ తరహాలోనే ఉంది. కండలు తిరిగినట్టుండే బాడీ డిజైన్‌, అగ్రెసివ్‌ స్ట్రీట్‌ఫైటర్‌ స్టాన్స్‌ ఈ బైక్‌ ప్రత్యేకతలు. 

ఈ బైక్‌లో 948సీసీ, లిక్విడ్‌ కూల్డ్‌ ఇన్‌లైన్‌ 4 సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 9,500 ఆర్‌పీఎం వద్ద 124 బీహెచ్‌పీ పవర్‌, 7,700 ఆర్‌పీఎం వద్ద 98.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ జత చేశారు. 

జెడ్‌900లో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్రూజ్‌ కంట్రోల్‌, బైడైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, కార్నరింగ్‌ ఏబీఎస్‌ వంటి ఎలక్ట్రానిక్‌ రైడింగ్‌ సదుపాయాలు కూడా అందించారు. ఈ ఫీచర్లు గత మోడల్‌ నుంచి కొనసాగుతున్నాయి.

కొత్త కవాసకి జెడ్‌900 ధర రూ.9.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ధరలో మార్పు లేకపోవడంతో పాటు కొత్త రంగులు రావడం ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ. కొత్త మోడల్‌ డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. కొనుగోలు చేయాలనుకునేవారు సమీపంలోని అధీకృత కవాసకి డీలర్‌షిప్‌లో అందుబాటు వివరాలు తెలుసుకోవచ్చు.