ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ లబ్ధిదారులకు కీలక సమాచారం అందించింది. ప్రతి నెలా 1వ తేదీన అందించే పెన్షన్లను, ఈసారి రెండు రోజుల ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, నవంబర్ 1వ తేదీకి బదులుగా అక్టోబర్ 30 నుంచే లబ్ధిదారులకు నగదు అందజేయనున్నారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, నవంబర్ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. సిబ్బంది అంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటం, పోలింగ్ రోజున లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ముందుగానే పూర్తి చేయాలని భావించింది.

ఈ మేరకు అక్టోబర్ 29వ తేదీ నాటికే పెన్షన్లకు అవసరమైన నగదును సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి, బ్యాంకు మేనేజర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 30న ప్రారంభమయ్యే ఈ పంపిణీ ప్రక్రియ, నవంబర్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఎన్నికల కారణంగా ఈ నెలలో మాత్రమే ఈ మార్పు చేశామని, వచ్చే నెల నుంచి యథావిధిగా ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.