నేపాల్ ప్రీమియర్ లీగ్ (ఎన్‌పీఎల్‌) ప్రారంభానికి ముందే ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే తమ దేశ క్రికెటర్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేయడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారీ మొత్తంలో ఫీజు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఒక్కో ఆటగాడికి ఎన్ఓసీ ఇచ్చేందుకు గాను, పీసీబీ ఛైర్మన్ మోహసిన్ నఖ్వీ నేతృత్వంలోని బోర్డు సుమారు 25,000 డాలర్లు (దాదాపు రూ. 23.73 లక్షలు) అడుగుతున్నట్లు నేపాల్ లీగ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో టోర్నీలో పాక్ స్టార్ ఆటగాళ్ల భాగస్వామ్యంపై అనిశ్చితి నెలకొంది.

ఈసారి నేపాల్ ప్రీమియర్ లీగ్ కోసం పలువురు పాకిస్థాన్ ప్రముఖ క్రికెటర్లు ఒప్పందాలు చేసుకున్నారు. వీరిలో టీ20 కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ సహా ఇఫ్తికార్ అహ్మద్, హసన్ అలీ, హైదర్ అలీ, హుస్సేన్ తలత్, ఉసామా మీర్, యువ పేసర్ హునైన్ షా వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. 

టోర్నమెంట్ త్వరలో ఖాట్మండులో ప్రారంభం కానున్న నేపథ్యంలో కొందరు ఆటగాళ్లు ఇప్పటికే తమ జట్లతో కలిసేందుకు నేపాల్ చేరుకున్నారు. 'క్రిక్‌ఇన్ఫో' కథనం ప్రకారం పీసీబీ నుంచి ఎన్ఓసీ కోసం మరికొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని ఎదురుచూస్తున్నారు.

పాకిస్థాన్ బోర్డు అకస్మాత్తుగా ఈ ఫీజు డిమాండ్ చేయడం టోర్నీ నిర్వాహకులను, ఆటగాళ్లను గందరగోళంలో పడేసింది. ఈ ఆర్థికపరమైన డిమాండ్ గురించిన అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు ఏమైనా జరిగాయా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

నిజానికి ఎన్‌పీఎల్‌ కోసం ఒప్పందం చేసుకున్న పాక్ ఆటగాళ్లలో ఎవరూ ప్రస్తుతం జాతీయ టెస్టు లేదా వన్డే జట్లకు ఆడటం లేదు. సమీప భవిష్యత్తులో పాకిస్థాన్ టీ20 షెడ్యూల్ కూడా ఏదీ ఖరారు కాలేదు. దీంతో జాతీయ విధులకు, లీగ్ షెడ్యూల్‌కు మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. 

పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త కాంట్రాక్టుల ప్రకారం జాతీయ జట్టు షెడ్యూల్‌తో క్లాష్ లేనంత వరకు ఆటగాళ్లు ఎన్ని ఫ్రాంచైజీ లీగ్‌లలోనైనా ఆడేందుకు స్వేచ్ఛ ఉంది. కానీ, ఇప్పుడు పీసీబీ కొత్తగా ఫీజు డిమాండ్ చేయడం ఆ నిబంధనకే విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ పరిపాలనాపరమైన ప్రతిష్ఠంభన వీడి, పీసీబీ తన వైఖరిని స్పష్టం చేసే వరకు నేపాల్ లీగ్‌లో పాక్ స్టార్ ఆటగాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మిగిలింది.