సంక్షేమం నుంచి స్వావలంబన దిశగా.. ఇదే మా విధానం: సీఎం చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంక్షేమం నుంచి స్వావలంబన దిశగా.. ఇదే మా విధానం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu will lead women from welfare to self-reliance
  • విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
  • గ్రామీణ మహిళల ఉత్పత్తుల కోసం 'స్వయం ఏపీ' బ్రాండ్ ఆవిష్కరణ
  • మహిళలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు
  • రాబోయే ఐదేళ్లలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తల తయారీకి ప్రణాళిక
  • ప్రతి గ్రామాన్ని ఉపాధి కేంద్రంగా మార్చడమే ధ్యేయమని స్పష్టీకరణ
మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా పరిమితం చేయకుండా, వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలు ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, సంపద సృష్టికర్తలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, గ్రామీణ మహిళల నైపుణ్యాలకు, ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో వేదిక కల్పిస్తున్న జాతీయ సరస్ మేళా-2026ను విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు 'స్వయం ఏపీ' బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. దసరా శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రి సాక్షిగా ఈ మేళా నిర్వహించడం నగరానికి మరింత శోభను తెచ్చిందన్నారు. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించి, ఎన్నో సవాళ్లను అధిగమించి దేశ అత్యున్నత పదవిని అలంకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

గ్రామాలే ఉపాధి కేంద్రాలుగా..

రాష్ట్రంలో 1.10 కోట్ల మంది సభ్యులతో 11 లక్షల స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా) ఉన్నాయని, ఇవి ఏటా రూ.69 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయని చంద్రబాబు వివరించారు. నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా రూపాంతరం చెందుతున్నాయని, భవిష్యత్తులో అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ మేళాలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 650 స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నాయని, ఇది కేవలం ప్రదర్శన కాదని, గ్రామీణ ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా తొలి అడుగని పేర్కొన్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ, కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని మహిళలకు సూచించారు.

సాంకేతికతతో ప్రపంచ మార్కెట్‌కు..

'స్వయం ఏపీ' బ్రాండ్ ఉత్పత్తులను ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్ వేదికల ద్వారా ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలను వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నప్పుడే 'వికసిత్ భారత్' లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. మహిళల భద్రత, ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిస్తూనే, వారి ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి స్వయం సహాయక సంఘం ఒక ఆర్థిక శక్తిగా, ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా, ప్రతి గ్రామం ఒక ఉపాధి కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Chandrababu Naidu
Droupadi Murmu
National Saras Mela 2026
Swayam AP Brand
Women Empowerment Andhra Pradesh
Vijayawada News

More Telugu News