90 కోట్ల అప్పు.. రోజూ 18 గంటల పని.. అమితాబ్ కష్టాలను గుర్తుచేసుకున్న రజనీకాంత్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

90 కోట్ల అప్పు.. రోజూ 18 గంటల పని.. అమితాబ్ కష్టాలను గుర్తుచేసుకున్న రజనీకాంత్!

Rajinikanth remembers Amitabh Bachchan struggles with 90 crore debt and 18 hour work days
  • అమితాబ్ బచ్చన్ ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక కష్టాలను వివరించిన రజనీ
  • రూ.90 కోట్ల అప్పుల కోసం రోజుకు 18 గంటల పాటు పనిచేసిన బిగ్ బీ
  • పని అడిగేందుకు యశ్ చోప్రా ఇంటికి నడిచి వెళ్లిన వైనం
  • పట్టుదలతో అప్పులు తీర్చి, కోల్పోయిన ఆస్తులను తిరిగి సంపాదించారని ప్రశంస
భారత సినీ పరిశ్రమలో ఇద్దరు మహానటులు, దిగ్గజాలు అయిన అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ మధ్య ఉన్న స్నేహం, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 33 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 'వెట్టయాన్' సినిమాతో మళ్లీ కలిసి నటించిన‌ సందర్భంగా, రజనీకాంత్.. అమితాబ్ బచ్చన్ జీవితంలోని ఒక క్లిష్టమైన, స్ఫూర్తిదాయకమైన ఘట్టాన్ని పంచుకున్నారు. 

'వెట్టయాన్' ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు రూ.90 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన అమితాబ్, తన అసాధారణ పట్టుదలతో ఎలా బయటపడ్డారో వివరించారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో మ‌రోసారి నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

రజనీకాంత్ మాటల ప్రకారం.. 1990లలో అమితాబ్ బచ్చన్ తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు 'అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఏబీసీఎల్‌) పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కానీ, ఆ వ్యాపారం ఆశించినంతగా విజయవంతం కాలేదు. దీంతో ఆయన సుమారు రూ.90 కోట్ల భారీ అప్పుల్లో కూరుకుపోయారు. ఆ కష్టకాలంలో ఆయన ముంబైలోని జుహూలో ఉన్న తన ఇల్లు సహా పలు ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బాలీవుడ్ పరిశ్రమలోని కొందరు ఆయన్ను చూసి ఎగతాళి చేశారని రజనీ గుర్తుచేసుకున్నారు.

"ఆ పరిస్థితి చూసి ముంబై పరిశ్రమలోని వాళ్లు నవ్వారు. కానీ అమితాబ్ వెనకడుగు వేయలేదు. అప్పటికే ఆయన వయసు 64 ఏళ్లు, అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. దాదాపు మూడేళ్ల పాటు రోజుకు 18 గంటలు నిర్విరామంగా పనిచేశారు. తనకున్న ప్రతి అప్పును తీర్చేశారు" అని రజనీకాంత్ వివరించారు. 

ఆ కష్టకాలంలో పని కోసం స్టార్ డైరెక్టర్ యశ్ చోప్రా ఇంటికి డ్రైవర్ లేకుండా తనే స్వయంగా నడుచుకుంటూ వెళ్లారని రజనీకాంత్ తెలిపారు. ఆ ప్రయత్నం ఫలించి 'మొహబ్బతేన్' సినిమాలో అవకాశం దక్కింది. ఆ తర్వాత వచ్చిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం ఆయన కెరీర్‌నే మార్చేసింది.

పట్టుదలతో అప్పులన్నీ తీర్చడమే కాకుండా, ఒకప్పుడు అమ్ముకున్న తన పాత ఇంటిని తిరిగి కొనుక్కున్నారని, అదే వీధిలో మరో రెండు ఇళ్లను కూడా సంపాదించారని రజనీకాంత్ ప్రశంసించారు. అమితాబ్ బచ్చన్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. గతంలో 'అంధా కానూన్', 'గిరఫ్తార్', 'హమ్' వంటి చిత్రాల్లో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు దిగ్గజాలు, 33 ఏళ్ల తర్వాత 'వెట్టయాన్' కోసం మళ్లీ తెరపై కనిపించారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Amitabh Bachchan
Rajinikanth
Vettaiyan
ABCL Bankruptcy
Amitabh Bachchan Debt
Bollywood News

More Telugu News