భవిష్యత్తులో మూడే రకాల ఉద్యోగాలు.. 'ఏఐ' నిపుణురాలి ఆసక్తికర విశ్లేషణ
Add ap7am to your home Screen

భవిష్యత్తులో మూడే రకాల ఉద్యోగాలు.. 'ఏఐ' నిపుణురాలి ఆసక్తికర విశ్లేషణ

Clara Shih says only three types of jobs will exist in the future
  • భవిష్యత్తులో ఉద్యోగాలు మూడే రకాలుగా ఉంటాయని ఏఐ నిపుణురాలి అంచనా
  • ఏఐ వినియోగదారుల కంటే ఏఐ చేత నిర్వహించబడే ఉద్యోగులే అధికం
  • కొత్త గ్రాడ్యుయేట్ల ఉద్యోగాలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపుతోందన్న నిపుణులు
  • తగిన చర్యలు తీసుకోకపోతే తయారీ రంగంలాగే అన్నిచోట్లా ఉద్యోగ సంక్షోభం
  • యువతకు అండగా ఉండేందుకు ‘న్యూ వర్క్ ఫౌండేషన్’ ఏర్పాటు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో ఉపాధి రంగంపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని ప్రముఖ టెక్ నిపుణురాలు క్లారా షి పేర్కొన్నారు. గతంలో సేల్స్‌ఫోర్స్, మెటా వంటి దిగ్గజ సంస్థల్లో ఏఐ విభాగాధిపతిగా పనిచేసిన ఆమె, సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడే రకాల ఉద్యోగాలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఏఐని రూపొందించేవారు, ఏఐని వినియోగించేవారు, ఏఐ పర్యవేక్షణలో పనిచేసేవారు అని వివరించారు.

ఇప్పటికే మూడో వర్గానికి చెందిన ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని, ఉబెర్ డ్రైవర్లు, డోర్‌డాష్ డెలివరీ సిబ్బంది, కస్టమర్ సపోర్ట్ ప్రతినిధులు వంటి వారు ఈ జాబితాలోకి వస్తారని ఆమె తెలిపారు. వీరి పనితీరును ఏఐ నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. అధిక శాతం మంది తాము ఏఐని ఉపయోగించే రెండో కేటగిరీలోకి వస్తామని భావిస్తున్నప్పటికీ, ఆ సమూహం అంచనా వేసిన దానికంటే చాలా చిన్నదని, భవిష్యత్తులో అది మరింత కుంచించుకుపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏఐ ఆవిర్భావంతో యువత, ముఖ్యంగా నూతన గ్రాడ్యుయేట్ల ఉపాధి అవకాశాలు ప్రమాదంలో పడుతున్నాయని క్లారా షి ఆందోళన వ్యక్తం చేశారు. తాను గతంలో పనిచేసిన సంస్థల్లోనూ ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల నియామకాలు తగ్గడాన్ని గమనించినట్లు ఆమె వెల్లడించారు. అమెరికాలో ఇటీవ‌ల కాలేజీ విద్య పూర్తి చేసిన ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రు నిరుద్యోగిగా ఉండటం లేదా తమ విద్యార్హతకు సంబంధం లేని పనుల్లో కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని ఆమె గణాంకాలను ఉటంకించారు. నూతనంగా విధుల్లోకి చేరే అభ్యర్థుల కంటే ఏఐ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుండటంతో, కంపెనీలు తమ నియామక ప్రక్రియల్లో భారీ మార్పులు చేస్తున్నాయని వివరించారు.

"సకాలంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే, ఒక‌ప్పుడు త‌యారీ రంగం ఏ విధమైన సంక్షోభాన్ని ఎదుర్కొందో, అదే ప‌రిస్థితి ఇప్పుడు అమెరికాలోని ప్ర‌తి ప్ర‌ధాన నగరంలోనూ పునరావృతమవుతుంది" అని ఆమె హెచ్చరించారు. ఈ మార్పులు అత్యంత వేగంగా సంభవిస్తున్నాయని, మారుతున్న పరిస్థితుల్లోకు అనుగుణంగా యువతకు దిశానిర్దేశం చేసేందుకు తాను 'న్యూ వ‌ర్క్ ఫౌండేష‌న్' అనే లాభాపేక్ష లేని సంస్థ‌ను స్థాపించిన‌ట్లు క్లారా షి తెలిపారు.
Advertisement
Clara Shih
Artificial Intelligence
Future of Jobs
AI Employment Impact
New Work Foundation

More Telugu News