ఫ్లైదుబాయ్‌ విమానాన్ని కూల్చేందుకు దాదాపు సిద్ధమైన ఇజ్రాయెల్‌.. కానీ, చివరి నిమిషంలో..!

ఫ్లైదుబాయ్‌ విమానాన్ని కూల్చేందుకు దాదాపు సిద్ధమైన ఇజ్రాయెల్‌.. కానీ, చివరి నిమిషంలో..!

Flydubai plane almost shot down by Israel after cockpit attack incident
  • విమానం టెల్‌అవీవ్‌ వైపు వెళ్తే దాడి చేయాలని ప్లాన్‌
  • యుద్ధ విమానాలను రంగంలోకి దించిన ఇజ్రాయెల్‌
  • లోపల ఉన్నవారిని సంప్రదించి నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళిక
  • ప్రధానమంత్రి అనుమతిస్తే కూల్చేద్దామని ప్లాన్‌ చేసుకున్న వైనం
  • విమానం సౌదీ వైపు మళ్లడంతో తప్పిన ముప్పు
ఫ్లైదుబాయ్‌ విమానంలో జరిగిన కాక్‌పిట్‌ దాడి సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానం టెల్‌అవీవ్‌ వైపు అలాగే వచ్చి ఉంటే దాన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధమైనట్లు సీఎన్‌ఎన్‌ న్యూస్‌ కథనం వెల్లడించింది. విమానాన్ని అడ్డుకునేందుకు ఆరోజు ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలను రంగంలోకి దించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 30న ఫ్లై దుబాయ్‌ 1073 విమానం దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌ బయలుదేరింది. మార్గమధ్యంలో కోపైలట్‌ హమామ్‌ అల్‌ హమ్మామీ.. కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌పై దాడి చేశాడు. కాక్‌పిట్‌ నియంత్రణను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు.

దాడి తర్వాత విమానం కేవలం 30 సెకన్లలో 16 వేల అడుగుల మేర కిందకు పడిపోయింది. దీంతో విమానం హైజాక్‌ అయిందా? లేక ఇజ్రాయెల్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తాయి.

ఇజ్రాయెల్‌ వైమానిక దళం కాక్‌పిట్‌తో సంప్రదించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అత్యవసర చర్యలు ప్రారంభించి కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్‌ గగనతలాన్ని మూసివేసి యుద్ధ విమానాలను రంగంలోకి దించారు.

అయితే విమానం టెల్‌అవీవ్‌ వైపు కాకుండా సౌదీ అరేబియా వైపు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసేందుకు విమానం అక్కడికి వెళ్తున్నట్లు నిర్ధారించడంతో ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలను వెనక్కి పిలిచారు. సౌదీ అరేబియా కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్లు సమాచారం.

విమానం టెల్‌అవీవ్‌ వైపు కొనసాగి ఉంటే ఇజ్రాయెల్‌ పైలట్లు ముందుగా దానికి చేరువగా వెళ్లి.. లోపల ఉన్నవారిని సంప్రదించేందుకు ప్రయత్నించేవారు. హైజాక్‌ నిర్ధారణై, దుండగుల నుంచి స్పందన రాకపోతే విషయం రక్షణ మంత్రి, ప్రధానమంత్రి దృష్టికి వెళ్లేది. విమానాన్ని కూల్చే తుది అధికారం ప్రధానమంత్రిదే అయ్యేది.

అయితే కెప్టెన్‌ తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగాడు. దీంతో ప్రయాణికులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్‌డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టి సౌదీ అరేబియాలోని తబూక్‌కు విమానాన్ని మళ్లించారు.
Advertisement
Flydubai
Israel Air Force
Hamam Al Hammami
Dubai Tel Aviv flight
Cockpit attack
Saudi Arabia emergency landing

More Telugu News