అసలేంటీ 'డెడ్‌హెడింగ్‌'?.. ఫ్లైదుబాయ్‌ ప్రయాణికులను ఎలా కాపాడింది?

అసలేంటీ 'డెడ్‌హెడింగ్‌'?.. ఫ్లైదుబాయ్‌ ప్రయాణికులను ఎలా కాపాడింది?

FlyDubai deadheading explained and how it saved passengers
  • పైలట్‌పై కోపైలట్ దాడితో ప్రమాదంలో పడిన ఫ్లైదుబాయ్ విమానం
  • 'డెడ్‌హెడింగ్‌'లో భాగంగా విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ట్రైనీ పైలట్లు
  • కాక్‌పిట్‌ను స్వాధీనం చేసుకుని విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన ట్రైనీలు  
విమానయాన రంగంలో 'డెడ్‌హెడింగ్‌' అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఒక విమానాన్ని ఒక ప్రదేశం నుంచి వెనక్కి తీసుకురావడానికి అవసరమైన పైలట్లను, సాధారణ ప్రయాణికులతో పాటు అదే విమానంలో పంపడాన్ని ఇలా పిలుస్తారు. సాధారణంగా పెద్దగా ప్రాధాన్యం లేని ఈ విధానమే, ఇటీవల ఫ్లైదుబాయ్‌ విమానంలోని వందలాది మంది ప్రయాణికులను ప్రాణాపాయం నుంచి కాపాడి అద్భుతం చేసింది. జెరూసలెం వెళ్తున్న విమానంలో కోపైలట్, ప్రధాన పైలట్‌పై దాడి చేయడంతో పెను ప్రమాదం అంచులకు వెళ్లిన ఆ విమానాన్ని, డెడ్‌హెడింగ్‌లో భాగంగా అందులో ఉన్న ఇద్దరు ట్రైనీ పైలట్లు సురక్షితంగా నేలకు దించారు.

ఆ రోజు విమానంలో జరిగిన భయానక క్షణాలను, అద్భుతమైన రక్షణను ప్రయాణికుడు డేనియల్ ష్లిక్టర్ ‘అసోసియేటెడ్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, కాక్‌పిట్‌లో గొడవ మొదలవగానే ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు ధైర్యం చేసి కోపైలట్‌ను పట్టుకోగా, అదే సమయంలో ప్రయాణికులుగా ఉన్న ఇద్దరు ట్రైనీ పైలట్లు హీరోల్లా స్పందించారు. వారిలో ఒకరు అతి కష్టమ్మీద కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానాన్ని నియంత్రణలోకి తెచ్చుకోగా, రెండో వ్యక్తి కూడా అతడికి జత కలిశారు.

"హీరోల్లా దూసుకొచ్చిన ఆ ఇద్దరు ఎవరనేది మాకు తెలియదు. వారిని నమ్మొచ్చో లేదో అర్థం కాలేదు. ఒకవేళ వాళ్లు ఉగ్రవాదులై, విమానాన్ని ఇరాన్‌కు హైజాక్ చేస్తున్నారేమోనని భయపడ్డాం" అని ష్లిక్టర్ తెలిపారు. అయితే, కాసేపటికే కాక్‌పిట్ నుంచి ప్రకటన వచ్చింది. విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అవుతోందని, అంతా క్షేమంగా ఉన్నారని చెప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

వాస్తవానికి, టెల్‌అవీవ్‌ నుంచి దుబాయ్‌కి విమానాన్ని తిరిగి నడిపేందుకు ఆ ఇద్దరు ట్రైనీ పైలట్లను ప్రయాణికులుగా పంపారు. ఈ 'డెడ్‌హెడింగ్‌' ఏర్పాటే, ఊహించని విధంగా ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకుని, ఆ పైలట్లను నిజమైన హీరోలుగా నిలబెట్టింది. వారికి తామంతా జీవితాంతం రుణపడి ఉంటామని ష్లిక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
FlyDubai
Deadheading
Trainee pilots
Flight safety
Saudi Arabia
Aviation incident

More Telugu News