ప్రియురాలిపై దాడి.. భవనం పైనుంచి దూకి ప్రియుడి ఆత్మహత్య
Advertisement

ప్రియురాలిపై దాడి.. భవనం పైనుంచి దూకి ప్రియుడి ఆత్మహత్య

Man attacks girlfriend and commits suicide by jumping from building
  • విజయవాడలో ఇద్దరి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం 
  • యువతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ప్రియుడు
  • అనంతరం సమీప భవనంపై నుంచి దూకి ఆత్మహత్య
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి
  • పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడమే కారణం?
నగరంలో ఓ ప్రేమ వ్యవహారం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమించిన యువతి దక్కదేమోనన్న ఆవేదనతో ఓ యువకుడు ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తాను కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన శనివారం ఉదయం న్యూ రాజరాజేశ్వరీపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పడవల మహాలక్ష్మి (19), మంకు చిన్నారావు (22) మృతి చెందారు.

పోలీసుల కథనం ప్రకారం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు పెయింటింగ్, ఫ్లవర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం విజయవాడలోని తన అన్నయ్య ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో న్యూ రాజరాజేశ్వరీపేటలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాస సముదాయంలో నాయనమ్మతో కలిసి ఉంటున్న మహాలక్ష్మితో అతడికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఓ దుస్తుల దుకాణంలో పనిచేసే మహాలక్ష్మితో పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా, ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇకపై మహాలక్ష్మి జోలికి వెళ్లనని ఆ సమయంలో చిన్నారావు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మహాలక్ష్మి ఇంటికి వెళ్లిన చిన్నారావు, ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన మహాలక్ష్మిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మరోవైపు, ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే చిన్నారావు సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న అజిత్‌సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. హత్య, ఆత్మహత్యగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 
Advertisement
Manku Chinnarao
Padavala Mahalakshmi
Vijayawada murder suicide
New Rajarajeswaripeta crime
Ajit Singh Nagar police case
Love affair tragedy Vijayawada

More Telugu News