ఫ్లైదుబాయ్ విమానంలో అసలేం జరిగింది? ప్లంబర్ ను నెతన్యాహు ఎందుకు అభినందించారు?

ఫ్లైదుబాయ్ విమానంలో అసలేం జరిగింది? ప్లంబర్ ను నెతన్యాహు ఎందుకు అభినందించారు?

What happened on the FlyDubai flight and why Netanyahu congratulated the plumber
  • దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో పైలట్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చేసే కుట్ర
  • ప్రాణాలకు తెగించి కాక్‌పిట్ డోర్ తెరిచిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్
  • కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి దాడిని అడ్డుకుని విమానాన్ని కాపాడిన ఇజ్రాయెలీ ప్లంబర్
  • "పెద్ద అడ్డంకి తొలగించావ్" అంటూ ప్రయాణికుడిని మెచ్చుకున్న ప్రధాని నెతన్యాహు
  • సౌదీ అరేబియాలో విమానం సురక్షిత ల్యాండింగ్
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఓ పెను ప్రమాదం తృటిలో తప్పింది. మరో 9/11 తరహా విధ్వంసాన్ని తలపించే కుట్రను ఓ ప్రయాణికుడి సాహసం, పైలట్ అసాధారణ ధైర్యం భగ్నం చేశాయి. విమానాన్ని కాపాడి హీరోగా నిలిచిన ఇజ్రాయెలీ ప్లంబర్‌ను ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన చమత్కారభరిత వ్యాఖ్య అందరినీ ఆకట్టుకుంది.

అసలేం జరిగిందంటే..

ఫ్లైదుబాయ్‌కు చెందిన FZ1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా, ఒమాన్‌కు చెందిన సహ పైలట్ అకస్మాత్తుగా భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని, దాన్ని అత్యంత వేగంగా కిందకు డైవ్ చేయించాడు. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ, కెప్టెన్ మచ్ఛర్ ధైర్యం కోల్పోకుండా కాక్‌పిట్ డోర్‌ను తెరిచి సహాయం కోసం గట్టిగా అరిచారు.

రంగంలోకి దిగిన ప్లంబర్

విమానం ఒక్కసారిగా కిందకు పడిపోవడం, కాక్‌పిట్ నుంచి అరుపులు వినపడటంతో యానివ్ హయున్ అనే ఇస్రేలీ ప్రయాణికుడు అప్రమత్తమయ్యాడు. వెంటనే కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి, దాడికి పాల్పడుతున్న సహ పైలట్‌ను వెనక్కి లాగేశాడు. అనంతరం విమానం కంట్రోల్స్‌ను పైకి లాగి దాన్ని స్థిరీకరించాడు. తాను చూసిన 'ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్' అనే టీవీ సిరీస్ ద్వారా విమాన నియంత్రణలపై తనకు కొంత అవగాహన ఉందని హయున్ తర్వాత చెప్పడం విశేషం. హయున్‌తో పాటు ఇతర ప్రయాణికులు, విమానంలో ఉన్న ఆఫ్-డ్యూటీ పైలట్ల సహాయంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం విమానాన్ని సమీపంలోని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

"పెద్ద అడ్డంకి తొలగించారు"

ఈ ఘటన అనంతరం ఇస్రేల్ చేరుకున్న యానివ్ హయున్‌ను ప్రధాని నెతన్యాహు బెన్ గురియన్ విమానాశ్రయంలో వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఆ సమయంలో హయున్ దుస్తులపై ఇంకా రక్తపు మరకలు ఉన్నాయి. ఆయనను అభినందించిన నెతన్యాహు, "మీరు జీవనోపాధి కోసం ఏం చేస్తుంటారు?" అని అడిగారు. అందుకు హయున్, "నేను ప్లంబర్‌ను, డ్రైనేజీల్లో పేరుకుపోయిన అడ్డంకులను తొలగిస్తాను" అని బదులిచ్చారు. దానికి నెతన్యాహు నవ్వుతూ, "ఈసారి మీరు నిజంగానే చాలా పెద్ద అడ్డంకిని తొలగించారు" అని చమత్కరించి ప్రశంసించారు.

ఈ ఘటనపై ఇస్రేల్ దర్యాప్తులో పాలుపంచుకుంటుందని, దీని వెనుక ఇరాన్ హస్తం ఉందేమోనన్న కోణంలోనూ విచారిస్తామని నెతన్యాహు తెలిపారు. అంతేకాకుండా, హయున్ ప్లంబింగ్ వ్యాపారాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రమోట్ చేస్తూ ఆయన ధైర్యాన్ని కొనియాడారు. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్, ప్రయాణికుడు యానివ్ హయున్ ధైర్యసాహసాల వల్లే వందలాది మంది ప్రాణాలతో బయటపడ్డారని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
Yaniv Hayun
Benjamin Netanyahu
FlyDubai flight attack
Captain Smith Machchar
Dubai Tel Aviv flight
Israeli plumber hero

More Telugu News