బీసీ రిజర్వేషన్లకు గొడ్డలి పార్టీయే అడ్డంకి.. రేపే సుప్రీంకోర్టుకు వెళుతున్నాం: సీఎం చంద్రబాబు

బీసీ రిజర్వేషన్లకు గొడ్డలి పార్టీయే అడ్డంకి.. రేపే సుప్రీంకోర్టుకు వెళుతున్నాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says Godali party is obstacle to BC reservations moving to Supreme Court tomorrow
  • గత ప్రభుత్వంపై రేపల్లె సభలో చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్‌పై పెడితే, తాము ఆక్సిజన్ అందించి కాపాడామన్న సీఎం
  • అమరావతిని ఎడారి, శ్మశానం అన్నారని.. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని ఫైర్
  • బీసీల రిజర్వేషన్లకు గత ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుపడిందని ఆరోపణ
  • స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని స్పష్టం
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తెలుగుదేశం పార్టీ 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, గత ‘గొడ్డలి పార్టీ’ ప్రభుత్వం దాన్ని 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. "దీనివల్ల దాదాపు 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారు. మేము మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తే, వాళ్లే కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారు. బీసీలపై ద్వేషంతోనే ఈ కుట్ర చేస్తున్నారు. అయినా మేం వెనకడుగు వేయం. రేపే సుప్రీంకోర్టుకు వెళుతున్నాం. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం" అని ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. "అప్పులు దొరక్కపోతే రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టారు. కనీసం మద్యపాన నిషేధం హామీని నిలబెట్టుకోకుండా, భవిష్యత్తులో 25 ఏళ్లపాటు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన దారుణమైన పరిస్థితిని సృష్టించారు. మేం అధికారంలోకి వచ్చాక ఆ అప్పుల వడ్డీ రేట్లను తగ్గించి, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నాం" అని వివరించారు. ముఖ్యమంత్రి అంటే సెక్రటేరియట్‌లో కూర్చోవడం కాదని, సామాన్యుడిలా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తీర్చడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు.

అమరావతి జోలికెళితే మసైపోతారు!
రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. "సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవంతో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనుకుంటే, అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ నాటకాలకు తెరలేపారు. అమరావతిని ఎడారి, శ్మశానం అంటూ సర్వనాశనం చేశారు. కానీ రైతుల త్యాగాలు, ముక్కోటి దేవతల ఆశీస్సులతో అమరావతి నిలబడింది. ఇకపై అమరావతిని ఒక్క ఇంచు కూడా ఎవరూ కదిలించలేరు. ఆ ప్రయత్నం చేస్తే మసి అయిపోతారు" అని తీవ్రంగా హెచ్చరించారు. 

అదేవిధంగా, పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను గోదావరిలో ముంచేశారని, తాము మళ్లీ దాన్ని బాగుచేసి వచ్చే ఏడాది మార్చి నాటికి ఫేజ్-1 పూర్తి చేసి కృష్ణా నదికి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతిపక్షంలో నిర్మాణాత్మక పోటీతత్వం ఉండాలి గానీ, గత ప్రభుత్వంలో కుట్రతత్వం మాత్రమే ఉందని చంద్రబాబు విమర్శించారు. "మేం పరిశ్రమలు తెస్తే, వాళ్లు పారిశ్రామికవేత్తలను తరిమికొట్టారు. ఇప్పుడు మళ్లీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. వ్యాన్‌పిక్ వంటి ప్రాజెక్టులను అవినీతితో నాశనం చేసి, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇప్పుడు సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కున్నారు. మేం రోడ్లు వేస్తే వాళ్లు గుంతలు తవ్వారు. పట్టాదారు పాసుపుస్తకాలపై, సర్వే రాళ్లపై కూడా వాళ్ల బొమ్మలు వేసుకొని రూ.800 కోట్లు దుర్వినియోగం చేశారు" అని ఆరోపించారు. వీటన్నింటినీ సరిచేసి, భూ సమస్యలకు బ్లాక్‌చైన్ టెక్నాలజీతో శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.

పాలనలో మార్పులు, అభివృద్ధి మంత్రం 
తాము కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచే ప్రభుత్వం కాదని, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. పీ4 కార్యక్రమం ద్వారా మార్గదర్శి కుటుంబాలు, బంగారు కుటుంబాల పేరిట ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. 'ఆరోగ్యం, ఆదాయం, ఆనందం' అనే మూడు సూత్రాలతో 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్యాన్ని ప్రజల భాగస్వామ్యంతో సాధిస్తామని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. 

మోదీ, పవన్‌తో కలిసే హామీ ఇచ్చాం!
2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజల వద్దకు వచ్చామని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ఆ నమ్మకంతోనే ప్రజలు కూటమికి 54% ఓట్లు, 94% సీట్లతో చారిత్రక విజయాన్ని అందించారని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తాము బాధ్యతగా స్వీకరించామని, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ ప్రజలకు సేవకులే తప్ప పెత్తందారులు కాదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి, తన సమర్థతతో దేశ ప్రధాని స్థాయికి ఎదిగారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ నిలిచారని పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో విజయాలు సాధిస్తోందని, ఆ అవకాశాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2024లో లభించిన చారిత్రక తీర్పు వెనుక ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో ఉన్న మైత్రి కీలక పాత్ర పోషించిందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ కృష్ణప్రసాద్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
BC Reservations
Supreme Court
Andhra Pradesh Politics
Amaravati Capital
YSRCP Criticism

More Telugu News