పల్లె పండుగ 3.0 ప్రారంభం.. గ్రామాలకు రూ.11,085 కోట్లు: సీఎం చంద్రబాబు
Advertisement

పల్లె పండుగ 3.0 ప్రారంభం.. గ్రామాలకు రూ.11,085 కోట్లు: సీఎం చంద్రబాబు

Nara Chandrababu Naidu launches Palle Panduga 3 and announces major projects in Udayagiri
  • ఉదయగిరిలో ‘పల్లె పండుగ-3’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.1,185 కోట్లు కేటాయించినట్లు ప్రకటన
  • గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనతో తమ రెండేళ్ల పాలనను పోల్చిన ముఖ్యమంత్రి
  • వెలిగొండ ఫేజ్-2 పూర్తితో పాటు ఉదయగిరి ప్రాంతానికి పలు ప్రాజెక్టులు మంజూరు
  • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ఎన్డీయే ప్రభుత్వ మంత్రమని స్పష్టీకరణ
రాష్ట్రంలోని పల్లెల్లో నవోదయానికి నాంది పలుకుతూ ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘పల్లె పండుగ-3’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.11,085 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “2024 ఎన్నికల్లో ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. మీరు వేసిన ఒక్క ఓటు కూడా వృథా కాలేదు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాం. నా అనుభవం, పవన్ కల్యాణ్ గారి ఉత్సాహం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం” అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాలు విధ్వంసానికి గురయ్యాయని, రోడ్లు గుంతలమయమై, వీధి దీపాలు వెలగని దుస్థితి ఉండేదని ఆయన విమర్శించారు.

గ్రామీణ రోడ్ల నిర్మాణంలో రికార్డు
‘పల్లె పండుగ-3’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15,500 కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం వివరించారు. మరో రూ.2,700 కోట్లతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మిస్తామని, ప్రతి ఇంటి ముందూ బురద లేని రోడ్లు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 880 కిలోమీటర్ల రోడ్లు వేస్తే, తమ ఎన్డీయే ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే 6,500 కిలోమీటర్ల రోడ్లు వేసి చరిత్ర సృష్టించిందని పోల్చి చెప్పారు. “అప్పుడు ఖర్చుపెట్టిన డబ్బులు దొంగల జేబుల్లోకి పోయాయి, ఇప్పుడు మేము ఖర్చుపెట్టే ప్రతి పైసా మీ ఊరిలో అభివృద్ధి రూపంలో కనిపిస్తోంది,” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పవన్ నాయకత్వంలో పంచాయతీరాజ్ అద్భుతం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిందని సీఎం ప్రశంసించారు. రెండున్నర దశాబ్దాల తర్వాత 10,000 మందికి పదోన్నతులు కల్పించడం, నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4,136 కోట్లు విడుదల చేయించడం వంటి విజయాలను ఆయన గుర్తుచేశారు. పంచాయతీరాజ్ శాఖకు 13 జాతీయ అవార్డులు రావడం పవన్ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు.

ఉదయగిరికి వరాల జల్లు
ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు.
65,000 ఎకరాలకు సాగునీరు అందించే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కాలువ పనులకు రూ.52.52 కోట్లు.
90,000 ఎకరాలకు సాగునీరు, 2.35 లక్షల మందికి తాగునీరు అందించే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 భూసేకరణకు రూ.85 కోట్లు.
రూ.3,876 కోట్ల పెట్టుబడితో 5,100 మందికి ఉద్యోగాలిచ్చే డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉదయగిరిని తీర్చిదిద్దేందుకు అవసరమైన క్లియరెన్సులు.
కనిగిరిలోని 189 ఫ్లోరైడ్ గ్రామాల సమస్య పరిష్కారానికి రూ.100 కోట్లు.
వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-2ను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

సంక్షేమం, అభివృద్ధి మా మంత్రం
ఎన్నికల్లో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ.4,000 పెన్షన్ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నామన్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులతో వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో బయటకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అభివృద్ధికి ఎవరైనా అడ్డువస్తే ఉపేక్షించేది లేదని, సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


Advertisement
Nara Chandrababu Naidu
Pawan Kalyan
Palle Panduga 3
Andhra Pradesh Rural Development
Udayagiri Development Projects
Panchayati Raj Department

More Telugu News