నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి: ముఖ్యమంత్రి చంద్రబాబు
Advertisement

నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి: ముఖ్యమంత్రి చంద్రబాబు

Skills are the driving force for development says CM Chandrababu Naidu
  • విజయవాడలో మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల సదస్సు
  • ఉద్యోగుల సామర్థ్యాల పెంపులో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం
  • పాలనలో టెక్నాలజీ వాడకం పెరగాలని సీఎం చంద్రబాబు పిలుపు
  • నేర్చుకున్న నైపుణ్యాలు సేవల నాణ్యతలో కనిపించాలని స్పష్టీకరణ
దేశాభివృద్ధిలో రాబోయే రెండు దశాబ్దాలు అత్యంత కీలకమని, ప్రజల మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనా వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన "మిషన్ కర్మయోగి" దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రసంగించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రకటించిన పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఏపీఎస్‌డీపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి స్వీకరించారు. ఈ విభాగంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి అవార్డులను అందుకున్నాయి.

శిక్షణ అంటే కేవలం ధ్రువపత్రాలు పొందడం మాత్రమే కాదని, నేర్చుకున్న నైపుణ్యాలు ప్రజలకు అందే సేవల నాణ్యతలో ప్రతిబింబించాలని సీఎం పేర్కొన్నారు. "ఒక రెవెన్యూ అధికారి సమస్యను వేగంగా పరిష్కరించడం, ఉపాధ్యాయుడు మెరుగ్గా బోధించడం వంటి సానుకూల మార్పులే శిక్షణకు అసలైన గీటురాయి" అని ఆయన వివరించారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఇంకా పాత నిబంధనలు, అనవసరమైన పేపర్‌వర్క్‌ను కొనసాగించడం సరికాదని, పాలనా ప్రక్రియలను సమూలంగా సంస్కరించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అత్యాధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో సమయాన్ని వెచ్చించే బదులు, 'ఐగాట్-మిషన్ కర్మయోగి' వేదిక ద్వారా తమ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రభుత్వం కేవలం నియంత్రణ వ్యవస్థగా కాకుండా, ప్రజలను సాధికారత దిశగా నడిపించేదిగా ఉండాలని, తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పలు దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Mission Karmayogi
Andhra Pradesh Capacity Building Award
Skill Development
Artificial Intelligence in Governance

More Telugu News