ఈ మధ్య కాలంలో మళ్లీ కోర్టు రూమ్ డ్రామాలు జోరందుకున్నాయి. ఈ జోనర్ కి సంబంధించిన సిరీస్ లు హిందీ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. థ్రిల్లర్ జోనర్ ను కూడా టచ్ చేస్తూ సాగే ఈ సిరీస్ పేరే 'హుంకార్: ది రోర్'. అనీత్ పడ్డా - ఫాతిమా సనాషేక్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కరణ్ .. హీరజ్ .. నిత్య మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 25వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, హిందీతో పాటు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
      
అది 'శబరీ ఫోర్ట్' పేరుతో పిలవబడే ఒక స్వామీజీ ఆశ్రమం .. ఆ స్వామీజీని అందరూ 'బాప్జీ' ( రఘువీర్ యాదవ్) పేరుతో పిలుస్తుంటారు. ఆశ్రమం పరిధిలో ఒక స్కూల్ ను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందులో చాలామంది ఆడపిల్లలు చదువుకుంటూ ఉంటారు. అక్కడ చదువుకుంటున్న టీనేజ్ అమ్మాయే 'మీనూ రావత్' (అనీత్ పడ్డా). ఆమె తల్లిదండ్రులు వైశాలి - ధర్మపాల్ రావత్. వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక రోజున ఆమె 'భోపాల్' లోని ఒక పోలీస్ స్టేషన్ కి తన పేరెంట్స్ తో వస్తుంది. తనపై బాప్జీ అత్యాచారానికి పాల్పడినట్టుగా ఫిర్యాదు చేస్తుంది. 

బాప్జీకి రాజకీయపరమైన పలుకుబడి ఉంటుంది. సమాజంలో ఆయనను బలంగా నమ్మే భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ కేసును డీల్ చేయడానికి ఏసీపీ జస్లీన్ (ఫాతిమా సనా షేక్) రంగంలోకి దిగుతుంది.  ఆమె కూడా ఫ్యామిలీ వైపు నుంచి ఒక సమస్యతో సతమతమైపోతుంటుంది. అందులో భాగంగానే తరచూ సెంట్రల్ జైలుకి వెళ్లి వస్తుంటుంది. మీనూ రావత్ కి జరిగిన అన్యాయం గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీడియా వాళ్లు పోలీసుల వైఫల్యాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. 

ఈ నేపథ్యంలోనే బాప్జీని జస్లీన్ అరెస్టు చేస్తుంది. అతణ్ణి కోర్టులో ప్రవేశపెడుతుంది. దాంతో ఒక వైపు నుంచి జస్లీన్ కి .. మరో వైపున మీనూ రావత్ ఫ్యామిలీకి బెదిరింపులు వస్తుంటాయి. బాప్జీ అరెస్టు గురించి తెలిసి ఆయన కొడుకు 'కశ్యప్' ఆ ఊరుకి వచ్చేస్తాడు. ఆశ్రమం వ్యవహారాలు చూసుకుంటున్న 'శివాని'తో కలిసి మంతనాలు జరుపుతాడు. మీనూ రావత్ ఫ్యామిలీని ఇరికించే ప్లాన్ చేస్తాడు. అతని ప్రయత్నం ఫలిస్తుందా? జస్లీన్ చుట్టూ ఉన్న సమస్య ఏమిటి? బాప్జీకి శిక్ష పడేలా ఆమె చేయగలుగుతుందా? అనేది మిగతా కథ.

దొంగ స్వామీజీలు భారీ స్థాయిలో ఆశ్రమాలను ఏర్పాటు చేసుకోవడం .. ఆ స్వామీజీల అనుచరులుగా కొంతమంది అక్కడ చేరడం .. లోపల అనేక అక్రమ కార్యకలాపాలు జరుగుతూ ఉండటం .. అవి బయటపెట్టడానికి ప్రయత్నిస్తే, ఆ ఫ్యామిలీని నానా ఇబ్బందులు పెట్టడం, అవినీతి అధికారులు వాళ్ల కొమ్ముకాయడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. కాకపోతే ఇక్కడ బాధితురాలితో పాటు ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ కూడా లేడీ కావడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. 

 నగరంలోని ప్రజలలో చాలామంది దైవంగా భావించే స్వామిజీపై మీనూ రావత్ ఫిర్యాదు చేయడంతో, ఫస్టు ఎపిసోడ్ లోనే కథ ఆసక్తిని రేపుతోంది. ఏసీపీగా తన తొలి కేసు అయినప్పటికీ ఆమె ఏ మాత్రం భయపడకుండా స్వామీజీని అరెస్టు చేయడంతో ఈ కథలో మరింత కదలిక మొదలవుతుంది. ఇక తండ్రి అరెస్టు అయ్యాడని స్వామిజీ కొడుకు రంగంలోకి దిగడంతో కథ మరింత పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మీనూ రావత్ కేసును తాను వాదిస్తానంటూ సిన్సియర్ న్యాయవాది 'భాలేరావ్' బరిలోకి దిగడం ఆడియన్స్ జారిపోనీయకుండా చేస్తుంది.

 ఇక ఇక్కడి నుంచి కోర్టు రూమ్ డ్రామా శాతం పెరుగుతూ వెళుతుంది. వాదనలు - ప్రతివాదనల జోరు పెరుగుతుంది. స్వామిజీ చేసిన తప్పు ఎలా బయటపడుతుంది? అనే టెన్షన్ ఒక వైపున సాగుతూ ఉండగానే, మరో వైపున 'నరబలి' .. ఆత్మహత్యలు వంటి సన్నివేశాలు స్క్రీన్ పైకి వస్తాయి. అయితే ఈ తతంగమంతా చాలా నిదానంగా ... నింపాదిగా జరుగుతూ ఉంటుంది. పోలీస్ కథల్లో కనిపించే స్పీడ్ .. హడావిడి ఈ కథలో మనకి కనిపించవు. 

స్వామిజీ పాత్రను ఆడియన్స్ ఆశించే స్థాయిలో డిజైన్ చేయకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. అలాగే ఆయన కొడుకు పాత్ర కూడా ఏ విధంగాను ప్రభావితం చేయలేకపోయింది. ఇక ఆశ్రమ నిర్వహణ మొత్తం చూసుకునే 'శివాని' పాత్ర లుక్ చూసి, నెగెటివ్ షేడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయనుకున్న ప్రేక్షకులకు నిరాశనే ఎదురవుతుంది. ఈ మూడు పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన గ్రాఫ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది.

పోలీస్ ఆఫీసర్ గా ఫాతిమా సనా షేక్ లుక్ బాగుంది. కానీ ఆమె పాత్రను చాలా సాదాసీదాగా డిజైన్ చేశారు. అలాగే జర్నలిస్ట్ అమితాబ్ సిన్హా పాత్ర .. న్యాయవాది భాలేరావు పాత్ర కూడా అంత పవర్ఫుల్ గా కనిపించవు. ఇక ఆధారాలు బయటపెట్టడం .. కోర్టులో జరిగే వాదోపవాదాలు కూడా అంత కిక్ ఇవ్వవు.  స్క్రీన్ పైకి వచ్చే సన్నివేశాలన్నీ కూడా నిదానంగా సాగుతూ, చాలా రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి. 

ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులంతా చాలా సహజంగా నటించారు. కబీర్ తేజ్ పాల్ ఫొటోగ్రఫీ .. దీపికా కల్రా ఎడిటింగ్ తో పాటు, నేపథ్య సంగీతం ఫరవాలేదనిపిస్తుంది. నిర్మాణం పరంగా .. భారీతనం పరంగా ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది. నటీనటుల ఎంపిక కూడా బాగుంది. అయితే రొటీన్ కథనే మళ్లీ చెప్పినట్టు అనిపిస్తుంది. 

దేవుడి ప్రతినిధులమంటూ కొత్త అవతారాలనెత్తే దొంగ స్వామీజీలను నమ్మకూడదు. ప్రజల బలహీనతయే వాళ్ల బలం. ఒక మనిషీ ఎప్పటికీ దేవుడు కాలేడు. దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడుగానీ, మన నుంచి ఏమీ ఆశించడు. ఈ విషయాన్ని మరిచిపోకూడదనే ఒక సందేశాన్ని మరోసారి గుర్తుచేసిన సిరీస్ గా 'హుంకార్' గురించి చెప్పుకోవచ్చు.