పవన్‌ కల్యాణ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం.. ఉద్యమ స్పూర్తితో పల్లెల అభివృద్ధి!
Advertisement

పవన్‌ కల్యాణ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం.. ఉద్యమ స్పూర్తితో పల్లెల అభివృద్ధి!

Chandrababu Naidu praises Pawan Kalyan for village development with movement spirit
  • ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ధి చేస్తున్న పవన్‌కు సీఎం అభినందనలు
  • గత ప్రభుత్వం ఐదేళ్లలో 880 కి.మీ. సీసీ రోడ్లు వేస్తే, కూటమి రెండేళ్లలో 6500 కి.మీ. వేసింది
  • పంచాయతీరాజ్‌ శాఖలో 10 వేల మందికి పదోన్నతులు కల్పించామని వెల్లడి
  • కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరిగిందని, పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వ పటిమపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన, పవన్ కల్యాణ్ ఒక ఉద్యమ స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ పల్లెల ప్రగతిలో తనదైన ముద్ర వేసిందని పేర్కొంటూ, ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో మూడు పల్లె పండుగలను అత్యంత విజయవంతంగా నిర్వహించుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని నిలబెడుతున్నాం. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం" అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పల్లెలు తీవ్ర విధ్వంసానికి గురయ్యాయని, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేలేని దుస్థితి నుంచి నేడు పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని వివరించారు.

కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఆయన ఏకరువు పెట్టారు. సుమారు రెండున్నర దశాబ్దాల విరామం తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 10 వేల మందికి పదోన్నతులు కల్పించామని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4,136 కోట్లు విడుదల చేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మిస్తే, తమ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే 6,500 కిలోమీటర్ల రోడ్లు వేసి చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రజాధనం దొంగల జేబుల్లోకి వెళ్లగా, నేడు అభివృద్ధి పనులు ప్రజల కళ్లకు కనిపిస్తున్నాయని విమర్శించారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Pawan Kalyan
Chandrababu Naidu
Palle Panduga
Andhra Pradesh Village Development

More Telugu News