రోడ్డు తనిఖీలో మంత్రి వీరంగం.. యువకుడి చెంపపై ఛెళ్లుమనిపించిన పర్వేశ్ వర్మ

రోడ్డు తనిఖీలో మంత్రి వీరంగం.. యువకుడి చెంపపై ఛెళ్లుమనిపించిన పర్వేశ్ వర్మ

Parvesh Verma slaps youth during road inspection in Delhi Tilak Nagar
  • రోడ్డు తనిఖీలో యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ
  • మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు సాహెబ్ సింగ్
  • కుటుంబాన్ని దూషించడంతోనే దాడి చేశానన్న మంత్రి
  • ఘటనపై ఆప్, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ వివాదం
ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి పర్వేశ్ వర్మ ఓ యువకుడి చెంపపై కొట్టిన ఘటన  రాజకీయ దుమారానికి దారితీసింది. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లో రోడ్డు నాణ్యతను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది.

తిలక్ నగర్ నియోజకవర్గంలో కొత్తగా వేసిన రోడ్డును పరిశీలించేందుకు మంత్రి పర్వేశ్ వర్మ ఆదివారం వెళ్లారు. అక్కడ స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌తో పాటు కొందరు స్థానికులు రోడ్డు నాణ్యత సరిగా లేదని, చేత్తో పెకిలిస్తే ఊడి వస్తోందని మంత్రికి చూపించారు. ఈ క్రమంలో, ఎమ్మెల్యే సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్న సాహెబ్ సింగ్ అనే యువకుడు తన ఫోన్‌లో ఈ దృశ్యాలను వీడియో తీయడం ప్రారంభించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి, ఆ యువకుడి నుంచి ఫోన్‌ను లాక్కొని చెంపపై బలంగా కొట్టారు. వెంటనే మంత్రి భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు.

ఈ ఘటనపై బాధితుడు సాహెబ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డు అధ్వాన పరిస్థితిని రికార్డ్ చేస్తుండగా మంత్రి తనపై దాడి చేశారని, ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మంత్రి భద్రతా సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు కూడా తనను బెదిరించారని ఆరోపించాడు. వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు వాస్తవాలను నిర్ధారించే పనిలో ఉన్నారు.

ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంత్రి తీరును తప్పుబడుతూ, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, మంత్రి పర్వేశ్ వర్మ తన చర్యను సమర్థించుకున్నారు. ఆప్ కార్యకర్తలు తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో దూషించారని, ఆ ఆవేశంలోనే తాను అలా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, స్థానిక ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కాంట్రాక్టర్ నుంచి కమీషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయంపై పీడబ్ల్యూడీ ఇంజనీర్ కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఆరోపించారు. దీంతో ఈ వివాదం ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
Advertisement
Parvesh Verma
Delhi PWD Minister
Tilak Nagar
Jarnail Singh
Delhi Road Quality
AAP vs BJP Delhi

More Telugu News