యువత ఉజ్వల భవిష్యత్తు కోసం భారీ పరిశ్రమలను రప్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది: మంత్రి గొట్టిపాటి

యువత ఉజ్వల భవిష్యత్తు కోసం భారీ పరిశ్రమలను రప్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది: మంత్రి గొట్టిపాటి

Gottipati Ravi Kumar says government bringing heavy industries for youth future
  • ఒంగోలులో నిర్వహించిణ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న గొట్టిపాటి
  • శాంతిభద్రతల పటిష్ఠత కోసం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడి
  • విద్యుత్ శాఖలో 600కు పైగా ఏఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని వెల్లడి

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఒంగోలులో ఈరోజు నిర్వహించిన కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ముగించుకుని విధులకు సన్నద్ధమవుతున్న నూతన కానిస్టేబుళ్లకు ఆయన అభినందనలు తెలిపారు.


ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ... రాష్ట్ర యువత ఉజ్వల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్రానికి భారీ పరిశ్రమలను, పెట్టుబడులను రప్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్ఠం చేసే చర్యల్లో భాగంగానే సుమారు 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని... స్వయంగా ముఖ్యమంత్రే అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారని గుర్తుచేశారు. దీనితో పాటు మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, విద్యుత్ శాఖలోనూ 600లకు పైగా ఏఈ (AE) పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అర్హులైన అభ్యర్థులకు త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామన్నారు.


మారుతున్న కాలానికి తగ్గట్టుగా నేరాల సరళి మారుతున్నందున, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తమ వృత్తి నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. శిక్షణ సమయంలోనూ యువతకు ఆర్థిక భరోసా ఉండాలనే ఉద్దేశంతోనే కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను గతంలో ఉన్న రూ.4,500 నుంచి ఏకంగా రూ.12,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

Advertisement
Gottipati Ravi Kumar
Andhra Pradesh Job Recruitment
AP Police Constable Parade
Mega DSC AP 2024
AP Industrial Investments
Ongole Police Training

More Telugu News