సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు.. విమర్శించే ముందు సందర్భాన్ని అర్థం చేసుకోండి: రేణు దేశాయ్

సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు.. విమర్శించే ముందు సందర్భాన్ని అర్థం చేసుకోండి: రేణు దేశాయ్

Renu Desai says I am not against Sanatana Dharma understand the context before criticizing
  • వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజే శబ్దాలపై రేణు దేశాయ్ విమర్శలు
  • రేణు దేశాయ్ పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్
  • మందు తాగి అసభ్యంగా ప్రవర్తించడం వంటి పోకడలను తప్పుబట్టానన్న రేణు
  • డప్పులు వంటి వాయిద్యాలతో భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని హితవు
  • పెద్ద శబ్దాల వల్ల చిన్నారులు, వృద్ధులు, పేషెంట్లు ఇబ్బంది పడతారని వ్యాఖ్య

వినాయక చవితి వేడుకలు, నిమజ్జన ఊరేగింపుల్లో అర్ధరాత్రి మోగే డీజే శబ్దాలపై నటి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పెద్ద కలకలమే రేపాయి. సోషల్ మీడియాలో కొందరు ఆమె మాటలను తప్పుగా అర్థం చేసుకుని తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో, ఆమె తాజాగా మరోసారి స్పందించాల్సి వచ్చింది. ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తాను ఎప్పుడూ సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదని, గణపతి బప్పాపై తనకు గాఢమైన భక్తి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా విషయంపై విమర్శించే ముందు పూర్తి సందర్భాన్ని అర్థం చేసుకోవాలని నెటిజన్లను కోరారు.


పండుగల వేళ భక్తి ముసుగులో అర్ధరాత్రి దాటాక హై వాల్యూమ్‌తో డీజేలతో హోరెత్తించడం, అలాగే మద్యం తాగి రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడం వంటి పోకడలనే తాను తప్పుబట్టానని రేణు దేశాయ్ వివరించారు. ఇవి ఏమాత్రం మన సంస్కృతి, సంప్రదాయాలు కాదన్న ఆమె... నిజమైన భక్తికి, శృతిమించిన విచ్చలవిడితనానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని హితవు పలికారు. వినాయక చవితి ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా, డప్పులు వంటి సాంప్రదాయ వాయిద్యాలతో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని... కేవలం చెవులు హోరెత్తించే డీజేల మోతను రాత్రిపూట కొనసాగించడాన్ని మాత్రమే తాను వ్యతిరేకించానని చెప్పారు.


పెద్ద పెద్ద శబ్దాల వల్ల చిన్నారులు, వృద్ధులు, అలాగే ఆసుపత్రుల్లో ఉండే పేషెంట్లు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని ఆమె కోరారు. ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలి కానీ, వాటివల్ల నలుగురికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తాను ఆ మాటలన్నానని తెలిపారు. ఇక తనను విమర్శిస్తూ కొందరు అసభ్య పదజాలంతో దూషించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను విమర్శించేముందు తాను చెప్పిన పాయింట్‌ వెనుక ఉన్న నిజాయతీని ప్రశాంతంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ, మూగజీవాల సంక్షేమం వంటి అంశాలపై గతంలోనూ ఆమె పబ్లిక్‌గా తన గళం వినిపించిన విషయం తెలిసిందే. వినాయక నిమజ్జన సమయంలో పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలనే వాడాలని ఆమె గతంలోనూ పలుమార్లు అవగాహన కల్పిస్తూ వచ్చారు.

Advertisement
Renu Desai
Vinayaka Chavithi
Ganesh Immersion DJ Sounds
Sanatana Dharma Controversy
Renu Desai Instagram Post
Noise Pollution Criticism

More Telugu News