పోలీసు యూనిఫాం గౌరవాన్ని, డిపార్ట్‌మెంట్ ప్రతిష్ఠను కాపాడాలి: టీజీ భరత్
- కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ లో ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
- 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లను అభినందించిన మంత్రి టీజీ భరత్
- డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచన
పోలీసు శాఖలోకి కొత్తగా అడుగుపెడుతున్న యువ కానిస్టేబుళ్లు కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ లో పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి టీజీ భరత్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్తగా బాధ్యతలు చేపడుతున్న కానిస్టేబుళ్లు విధులను సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా, తాము ధరించిన యూనిఫాం గౌరవాన్ని, డిపార్ట్‌మెంట్ ప్రతిష్ఠను ఎల్లప్పుడూ కాపాడాలని పిలుపునిచ్చారు.
నేటి ఆధునిక కాలంలో నేరాల తీరు మారిపోతోందని మంత్రి పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మహిళలు అలాగే చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు నేటి పోలీసులకు సవాలుగా మారుతున్నాయని గుర్తుచేశారు. ఈ క్రైమ్స్‌ను ఎదుర్కోవాలంటే కేవలం సంప్రదాయ పద్ధతులే కాకుండా డిజిటల్ పరిజ్ఞానం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మొబైల్స్, కంప్యూటర్లు, సీసీటీవీ ఫుటేజ్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పక్కా ఆధారాలు సేకరించడంలో మన పోలీసులు నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తు అంతా టెక్నాలజీ, డేటా ఆధారిత పోలీసింగ్‌దేనని, కొత్త తరం సిబ్బంది ఈ ఆధునిక సాంకేతికతను వేగంగా ఒడిసిపట్టాలని ఆకాంక్షించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి తమ కెరీర్‌ను ప్రారంభిస్తున్న అందరికీ ఇది చక్కటి ఆరంభమని అన్నారు.
ఇక పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాబోయే రోజుల్లో మరిన్ని పోలీస్ ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ తదితరులు పాలుపంచుకున్నారు.