ఆసియా క్రీడలు: వర్షంతో మారిన లెక్కలు.. టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారు

ఆసియా క్రీడలు: వర్షంతో మారిన లెక్కలు.. టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారు

Asian Games Rain changes equations Team India quarter final opponent confirmed
  • ఆసియా క్రీడల క్రికెట్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్ 
  • నేపాల్, జపాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడమే దీనికి కారణం
  • ఈ ఫలితంతో నేపాల్ పూల్-ఏ టాపర్‌గా, ఆఫ్ఘ‌న్ రెండో జట్టుగా నాకౌట్‌కు 
  • ఈ నెల‌ 28న నిషిన్‌లో భారత్, ఆఫ్ఘ‌న్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ 
ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పోటీల్లో నాకౌట్ దశ ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 28న నిషిన్‌లో జరగనున్న క్వార్టర్ ఫైనల్‌లో టీమిండియా, ఆఫ్ఘ‌నిస్థాన్‌తో తలపడనుంది. ఈరోజు నేపాల్, జపాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు కావడంతో ఈ సమీకరణం ఖరారైంది. ఈ ఫలితంతో నేపాల్ పూల్-ఏ టాపర్‌గా నిలవగా, ఆఫ్ఘ‌నిస్థాన్ రెండో జట్టుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.

వివరాల్లోకి వెళితే.. నిషిన్‌లో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్, నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక దశలో 10 ఓవర్లకు 84/4తో కష్టాల్లో ఉన్న నేపాల్‌ను సందీప్ జోరా, లోకేశ్‌ బామ్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 

జోరా కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో లోకేశ్‌ బామ్ మరింత విధ్వంసకరంగా ఆడి, కేవలం 22 బంతుల్లో ఒక ఫోర్, 6 భారీ సిక్సర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు, ఆసిఫ్ షేక్ (21) ఫర్వాలేదనిపించాడు.

అనంతరం 150 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగాల్సిన జపాన్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జపాన్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో మెరుగైన రికార్డు ఆధారంగా నేపాల్ గ్రూప్ టాపర్‌గా నిలిచింది. దీంతో ఇదే గ్రూప్‌ నుంచి ఆఫ్ఘ‌నిస్థాన్ రెండో క్వాలిఫైయింగ్ జట్టుగా నాకౌట్ దశకు చేరుకుంది. జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ అనూహ్య పరిణామంతో పటిష్ఠమైన భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌ను ఢీకొట్టనుంది. సెమీ ఫైనల్‌లో స్థానం కోసం ఇరు జట్ల మధ్య జరిగే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Advertisement
Team India
Asian Games 2026
Afghanistan Cricket Team
Asian Games Cricket Quarter Finals
Nepal Cricket Team
Japan Cricket Team

More Telugu News