గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు షాక్‌.. అమెరికాలో కొత్త బిల్లు!

గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు షాక్‌.. అమెరికాలో కొత్త బిల్లు!

  • గ్రీన్‌కార్డుకు పాయింట్ల విధానం ప్రతిపాదన
  • పెండింగ్‌ పిటిషన్లపైనా ప్రభావం
  • ఏటా 1.92 లక్షల వీసాల కేటాయింపు
  • కనీసం 16 పాయింట్లు తప్పనిసరి
  • డైవర్సిటీ వీసా లాటరీ రద్దుకు ప్రతిపాదన
అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు విధానాన్ని పూర్తిగా మార్చే బిల్లును రిపబ్లికన్‌ సెనేటర్‌ టామీ ట్యూబర్‌విల్లే ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే ఇప్పుడున్న విధానం స్థానంలో పాయింట్ల ఆధారిత సిస్టమ్‌ వస్తుంది.

‘అమెరికన్స్‌ ఫస్ట్‌ ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పలు ఉద్యోగ ఆధారిత పిటిషన్లు చెల్లకుండా పోయే అవకాశం ఉంది. వాటి ఆధారంగా గ్రీన్‌కార్డు కోసం పెట్టుకున్న దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే పిటిషన్‌ ఆమోదం పొందిన వారికి మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. అయితే ఆర్థిక సంవత్సరం కేటాయింపులు పూర్తయ్యే వరకు మాత్రమే వీసాలు ఇచ్చేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ కేటగిరీలో కొత్త వీసాలు ఇవ్వరు. ఈ నిబంధన వల్ల గ్రీన్‌కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

కొత్త విధానంలో ఏటా ప్రపంచవ్యాప్తంగా 1,92,000 వీసాలు కేటాయించాలని ప్రతిపాదించారు. దరఖాస్తుదారులకు అమెరికాలో ఉద్యోగ ఆఫర్‌ ఉండాలి. కనీసం 16 పాయింట్లు సాధించాలి. వయసు 18 నుంచి 51 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంగ్లిష్‌లోనూ నిర్దిష్ట స్థాయి ప్రావీణ్యం ఉండాలి.

వేతనం, విద్య, ఇంగ్లిష్‌ పరిజ్ఞానం, సైనిక సేవ, అసాధారణ ప్రతిభ ఆధారంగా పాయింట్లు ఇస్తారు. ఎక్కువ పాయింట్లు సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అమెరికా డిగ్రీ లేని వారికి రాష్ట్ర సగటు వేతనానికి కనీసం రెండింతల జీతంతో ఉద్యోగ ఆఫర్‌ ఉండాలి. అమెరికా డిగ్రీ ఉన్నవారికి ఈ పరిమితి 1.5 రెట్లు ఉంటుంది.

అదే సమయంలో డైవర్సిటీ వీసా లాటరీని రద్దు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. కుటుంబ ఆధారిత వలసలను భార్యాభర్తలు, మైనర్‌ పిల్లలకు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, వయోజన పిల్లలకు గ్రీన్‌కార్డు మార్గాలను తొలగించే ప్రతిపాదన కూడా ఉంది.
Advertisement

More Telugu News