సీమకు మహర్దశ.. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో హార్టీకల్చర్ హబ్

సీమకు మహర్దశ.. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో హార్టీకల్చర్ హబ్

Rayalaseema transformation with one lakh crore investment horticulture hub
  • రాయలసీమను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం
  • రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 201 క్లస్టర్లలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు
  • అక్టోబర్ 2న మదనపల్లెలో ప్రాజెక్టును ప్రారంభించనున్న చంద్రబాబు
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సీమ ఆర్థిక స్వరూపం మార్పు లక్ష్యం
  • ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై సమీక్ష
రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా (గ్లోబల్ ఫ్రూట్ బౌల్) తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ‘రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్’ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ వివరాలు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్ల ద్వారా ఈ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ప్రభుత్వం రూ. 40 వేల కోట్లు, ప్రైవేటు రంగం రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఒకప్పుడు కరవుతో అల్లాడిన రాయలసీమను ఉద్యాన రంగం ద్వారా ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యత పెరగడం ఈ మార్పునకు దోహదం చేసిందని ఆయన గుర్తుచేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవో) బలోపేతం చేయనున్నారు. కొత్త పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'కు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ఈ సమీక్షలో ఎల్‌నినో ప్రభావం, ద్రవ్యోల్బణంపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు శనగ, మినుము, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే వినియోగదారులపై భారం పడకుండా చూడాలని ఆదేశించారు. ఈ హబ్ ద్వారా రాబోయే 5-6 ఏళ్లలో సీమ రూపురేఖలు మార్చాలని లక్ష్యంగా నిర్దేశించారు.
Advertisement
Nara Chandrababu Naidu
Rayalaseema Horticulture Hub
Global Fruit Bowl Rayalaseema
Andhra Pradesh Agriculture Projects
Madanapalle Indian School of Agriculture
Horticulture Investment Andhra Pradesh

More Telugu News