ఎన్నికల సంఘం యాప్‌పై మరోసారి వివాదం.. ఓటు హక్కులు హరించివేస్తున్నారని శశి థరూర్ ఫైర్
- ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ECINet సాఫ్ట్‌వేర్‌పై వివాదం
- పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేరిక అన్నీ ఎన్నికల ప్రధాన కమిషనర్ స్థాయిలోనే జరుగుతున్నాయని ఆరోపణలు
- పౌరుల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడుతున్నాయన్న శశి థరూర్
ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ECINet సాఫ్ట్‌వేర్‌పై మళ్లీ తీవ్ర వివాదం చెలరేగింది. కొత్త ఓటర్ల చేరిక, పేర్ల తొలగింపు వంటి నిర్ణయాలు ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్థాయిలోనే జరుగుతున్నాయని, మిగతా ఇద్దరు కమిషనర్లకు సమాచారం కూడా అందడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోవాలో జరిగిన ఘటనే ఈ వివాదానికి కారణం. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సమయంలో కొన్ని పేర్లపై సాఫ్ట్‌వేర్ అభ్యంతరాలు చూపింది.
క్షేత్రస్థాయిలో సరిగ్గా పరిశీలించిన తర్వాత 97 మంది ఓటర్లు అర్హులేనని స్థానిక అధికారులు నిర్ధారించారు. కానీ వారి పేర్లను తిరిగి చేర్చేందుకు అవసరమైన రోల్‌బ్యాక్ సౌకర్యం యాప్‌లో లేదు. దీంతో గోవా ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి పదేపదే అభ్యర్థనలు పంపారు. అయినా అనుమతి రాకపోవడంతో ఆ పేర్లు జాబితాలోకి రాలేకపోయాయి. యాప్‌పై పూర్తి నియంత్రణ ఢిల్లీ వద్దే ఉందని సమాచారం. ఓటరు జాబితాలో పేరు లేకపోతే కేవలం ఓటు మాత్రమే కాదు... గోవా మెడిక్లెయిమ్ పథకం కింద డయాలసిస్, గుండె శస్త్రచికిత్స, అవయవ మార్పిడి, కీమోథెరపీ వంటి కీలక చికిత్సలకు కూడా అవకాశం దక్కదు. ఈ పథకం రాష్ట్ర ఓటర్లకే పరిమితం కావడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారని థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు.
తన సోషల్ మీడియా పోస్టులో ఆయన “ఇది కేవలం రాజకీయ సమస్య కాదు. పౌరుల ప్రాథమిక హక్కులు, ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇలాంటి అమానుష వ్యవస్థను కొనసాగించకూడదు. ఎన్నికల సంఘం వెంటనే క్షమాపణ చెప్పి, ఈ సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేయాలి. జరిగిన నష్టాన్ని సరిదిద్దాలి” అని స్పష్టం చేశారు.