క్యాషియర్‌ నుంచి రూ.8 కోట్ల జీతం వరకు.. వైరలవుతున్న అమెరికన్‌ మహిళ లింక్డిన్‌ ప్రొఫైల్‌

క్యాషియర్‌ నుంచి రూ.8 కోట్ల జీతం వరకు.. వైరలవుతున్న అమెరికన్‌ మహిళ లింక్డిన్‌ ప్రొఫైల్‌

  • చదువుకునే రోజుల్లోనే క్యాషియర్‌గా గంటకు 4.15 డాలర్లతో కెరీర్‌ ప్రారంభం
  • 40 ఏళ్లుగా హోమ్‌ డిపోలోనే కొనసాగుతున్న క్యాంప్‌బెల్‌
  • స్టోర్‌ మేనేజర్‌ నుంచి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎదుగుదల
  • ప్రస్తుతం ఏడాదికి 1 మిలియన్‌ డాలర్లకు పైగా జీతం
  • కష్టపడి పనిచేయడం, సంబంధాలు, నేర్చుకోవడం కీలకమని వెల్లడి
1985లో జమైకా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఓ యువతి.. దక్షిణ ఫ్లోరిడాలో తన కాలేజీ చదువుకు డబ్బులు సంపాదించేందుకు ఉద్యోగం కోసం ప్రయత్నించింది. అప్పుడు ఆమెకు దొరికిన పని ఓ రిటైల్‌ స్టోర్‌లో పార్ట్‌టైమ్‌ క్యాషియర్‌ ఉద్యోగం. గంటకు 4.15 డాలర్ల జీతం.

ఆ ఉద్యోగమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అప్పట్లో ఆమె కూడా ఊహించి ఉండకపోవచ్చు. నాలుగు దశాబ్దాల తర్వాత అదే సంస్థలో టాప్‌ లీడర్‌గా ఎదిగారు. ఇప్పుడు ఏడాదికి 1 మిలియన్‌ డాలర్లకు పైగా జీతం అందుకుంటున్నారు. ఆమెనే హోమ్‌ డిపో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆన్‌-మేరీ క్యాంప్‌బెల్‌.

క్యాషియర్‌ నుంచి స్టోర్‌ మేనేజర్‌గా..
క్యాంప్‌బెల్‌ హోమ్‌ డిపోలోనే తన కెరీర్‌ను కొనసాగించారు. క్యాషియర్‌గా మొదలైన ప్రయాణం క్రమంగా స్టోర్‌ మేనేజర్‌ స్థాయికి తీసుకెళ్లింది. 1990లలో డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్కడితో ఆమె ఎదుగుదల ఆగలేదు. 2000లలో కంపెనీ కార్పొరేట్‌ విభాగంలోకి వెళ్లారు. ఒక్కో బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నత స్థాయులకు చేరుకున్నారు.

2016లో అమెరికా స్టోర్లు, అంతర్జాతీయ కార్యకలాపాలకు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2023 నవంబర్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు.

ఏడాదికి 1 మిలియన్‌ డాలర్లకు పైగా..
క్యాంప్‌బెల్‌ ప్రస్తుతం ఏడాదికి 1 మిలియన్‌ డాలర్లకు పైగా జీతం అందుకుంటున్నారు. ఆమె కెరీర్‌ ప్రస్థానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘అక్వైర్డ్‌’ పాడ్‌కాస్ట్‌ ‘ఎక్స్‌’లో ఆమె కెరీర్‌ ప్రస్థానాన్ని చూపించే స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది. 1985లో పార్ట్‌టైమ్‌ క్యాషియర్‌గా మొదలై.. స్టోర్‌ మేనేజర్‌, డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌, కార్పొరేట్‌ లీడర్‌, చివరకు కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.

ఎదుగుదలకు మూడు విషయాలే..
తన కెరీర్‌లో ఎదగడానికి కష్టపడి పనిచేయడం, నిజమైన సంబంధాలను ఏర్పరచుకోవడం, నిరంతరం నేర్చుకోవడం కీలకమని క్యాంప్‌బెల్‌ చెబుతారు.

“కష్టపడి పనిచేయడం అవకాశాల తలుపు తెరుస్తుంది. కానీ ఒక్కరే ముందుకు వెళ్లలేరు. మనకు నేర్పించే, ముందుకు నడిపించే వ్యక్తులు చుట్టూ ఉండాలి” అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

చిన్నప్పుడు ఓ టీచర్‌ చెప్పిన మూడు విషయాలను కూడా ఆమె ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. సమయానికి రావడం, పరిస్థితులకు తగ్గట్టు ముందుకు సాగడం, అవసరమైనప్పుడు మాట్లాడటం.. ఇవే ఆ మూడు పాఠాలు.

సాయం అడగడం కూడా విజయమే..
1990ల చివర్లో మియామి ప్రాంతంలో 13 స్టోర్లను పర్యవేక్షిస్తున్న సమయంలో క్యాంప్‌బెల్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆమెకు  నాలుగేళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పరిస్థితులు భరించలేనంతగా మారడంతో ఉద్యోగం వదిలేయాలని కూడా ఆలోచించారు. అయితే ఆమె బాస్‌ పరిస్థితిని గుర్తించి అండగా నిలిచారు. దాంతో అవసరమైనప్పుడు ఇతరుల సాయం అడగడం బలహీనత కాదని ఆమె తెలుసుకున్నారు.

అప్పటి నుంచి ఇతరులకు అవకాశాలు కల్పించడం, ఎదగడానికి తోడ్పడటం తన నాయకత్వంలో ముఖ్యమైన భాగంగా మార్చుకున్నారు.

“మీ కల నిజమవుతుంది”..
క్యాంప్‌బెల్‌ ఇప్పటికీ హోమ్‌ డిపోలోనే కొనసాగుతున్నారు. ఆమె మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. మనకు నచ్చిన పని చేస్తే ఉద్యోగం కాస్తా కెరీర్‌గా మారుతుంది. “మీరు సాధించగలరని నమ్మండి. మీ కల నిజమే. దాన్ని సాధించడానికి పనిపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి” అని ఆమె సూచిస్తున్నారు.
Advertisement

More Telugu News