‘అలా అయితే ప్రీమియర్‌ షోకు దూరంగా ఉంటాం’.. సీఎం రేవంత్‌ స్పందనకు నాని రిప్లై

‘అలా అయితే ప్రీమియర్‌ షోకు దూరంగా ఉంటాం’.. సీఎం రేవంత్‌ స్పందనకు నాని రిప్లై

Nani reply to CM Revanth Reddy response says will stay away from premier show if needed
  • పోలీసుల తుది నిర్ణయాన్ని గౌరవిస్తామన్న నాని
  • భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని స్పష్టీకరణ
  • గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లకు ప్రాధాన్యం
  • ఇబ్బందులుంటే ప్రీమియర్‌ షోకు దూరంగా ఉంటామని వెల్లడి
  • డీజీపీకి తగిన చర్యలపై సీఎం ఆదేశాలు
‘ది ప్యారడైజ్‌’ ప్రీమియర్‌ షో విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించడంపై హీరో నాని ధన్యవాదాలు తెలిపారు. గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్ల నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పోలీసు శాఖపై ఎలాంటి అదనపు భారం మోపాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. భద్రత, జన సమూహ నియంత్రణ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే.. థియేటర్‌ సందర్శనను రద్దు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలీసు శాఖ తీసుకునే తుది నిర్ణయాన్ని గౌరవించి, దానికి అనుగుణంగా నడుచుకుంటామని నాని పేర్కొన్నారు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ ప్రీమియర్‌ షో చూసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని నాని కోరారు. దీనిపై సీఎం ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానిని అభినందించారు. తెలంగాణ బిడ్డ శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్‌’పై నానికి ఉన్న ఆసక్తిని ప్రశంసించారు.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా, జన సమూహాన్ని నియంత్రించేందుకు నిర్దేశిత స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. దరఖాస్తును సంబంధిత పోలీసు బృందం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని సీఎం ఆదేశించారు. తాజాగా సీఎం స్పందనకు నాని ధన్యవాదాలు చెబుతూ.. పోలీసుల తుది నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తామని స్పష్టం చేశారు.
Advertisement
Nani
Revanth Reddy
The Paradise movie
Ganesh Nimajjanam
Telangana Police
RTC X Roads

More Telugu News