ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ (25) అనుమానాస్పద కస్టడీ మరణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) ఎస్.ఎస్.వి.వి. నాగరాజును ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంటూ, మరో ఆరుగురితో కలిపి మొత్తం ఏడుగురిపై సోమవారం విజయవాడ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సాయికృష్ణను అక్రమంగా అరెస్ట్ చేయడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, దాని ఫలితంగా అతను మరణించడం, సాక్ష్యాలను నాశనం చేసేందుకు మృతదేహాన్ని దహనం చేయడం వంటి కీలక ఆధారాలను సిట్ కోర్టుకు సమర్పించింది.

ఈ కేసులో నాగరాజుతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్ కుమార్, నాని, సీఐ సన్నిహితుడు గులివిందల సురేశ్, కానిస్టేబుళ్లు బాబూరావు, శ్యామయ్య, హోంగార్డు వెంకట్‌లను నిందితులుగా చేర్చారు. మే 6న పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాయికృష్ణ అదృశ్యమయ్యాడు. లాకప్‌లో తీవ్రంగా కొట్టడం వల్లే తన కుమారుడు చనిపోయాడని, ఆ తర్వాత మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేశారని అతని తల్లి విజయలక్ష్మి ఆరోపించారు.

విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు జూన్ 19న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్లు 127 (4), 127 (6), 103 (1), 238 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం ఐజీ (లా అండ్ ఆర్డర్) ఎం. రవిప్రకాశ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ రంగంలోకి దిగి జూన్ 21న సస్పెండైన సీఐ నాగరాజును అరెస్ట్ చేసింది. ఇటీవల నిందితుడు సురేశ్ కోర్టులో లొంగిపోయిన నాలుగు రోజుల తర్వాత సిట్ ఈ చార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన దారుణం

సిట్ దర్యాప్తులో సురేశ్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. విచారణ సమయంలో సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో చూశానని, ఆ తర్వాత మే 12న రాణిగారి తోటలోని ఓ ప్రైవేట్ ఇంట్లో చూడగా, అతను దయనీయ స్థితిలో ఉన్నాడని సురేశ్ అంగీకరించాడు. పోలీసులు తనను ప్రతిరోజూ తీవ్రంగా కొడుతున్నారని సాయికృష్ణ తనతో చెప్పాడని సురేశ్ వెల్లడించాడు. తనతో మాట్లాడుతుండగానే సాయికృష్ణ కుప్పకూలిపోయాడని, హెడ్ కానిస్టేబుళ్లు నాడి చూసి చనిపోయినట్లు నిర్ధారించారని తెలిపాడు.

సీఐ నాగార్జు ఆదేశాల మేరకు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు మే 12న అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి టూ-వీలర్‌పై స్వర్గపురి శ్మశానవాటికకు తరలించగా, తాను బైక్‌పై వారిని అనుసరించానని సురేశ్ వివరించాడు. అక్కడ ముగ్గురూ కలిసి మృతదేహాన్ని దహనం చేసినట్లు చెప్పాడు. సాక్ష్యాలు మిగిలి ఉన్నాయేమోనని నిర్ధారించుకునేందుకు మే 18న నాగరాజు, సురేశ్ మళ్లీ శ్మశానవాటికకు వెళ్లి పరిశీలించినట్లు దర్యాప్తులో తేలింది.

అంతేకాకుండా, ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు సీఐ నాగరాజు.. సాయి కృష్ణ మేనమామలు ముళ్లపూడి నవరం, నాగేశ్వరరావులను కలిసి డబ్బు ఆశ చూపి రాజీకి ప్రయత్నించాడని, కానీ వారు నిరాకరించారని సిట్ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో మే 5న మార్కాపురంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకుని, మరుసటి రోజు కృష్ణలంక పోలీసులకు అప్పగించినట్లు విచారణలో తేలింది.