'సర్' ప్రక్రియ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు: సీపీఐ నారాయణ
- సర్ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నారన్న నారాయణ
- అద్వానీ, జైశంకర్ వంటి ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేశారని విమర్శ
- వివాహానంతరం మహిళల ఇంటిపేర్లు మారడాన్ని కూడా పెద్ద సమస్యగా చూపుతున్నారని మండిపాటు
ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన (సర్) పేరుతో చేపడుతున్న వింత, వికృత చర్యలు ప్రజల ప్రాథమిక ఓటు హక్కును కాపాడేలా లేవని, విజ్ఞతలేని తీరుతో ఓటర్లను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని సీపీఐ సీనియర్ నేత నారాయణ ఘాటుగా విమర్శించారు. సర్ ప్రక్రియ పేరుతో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న వైఖరి ‘ఎద్దు ఈనిందంటే దూడను గాట్లో కట్టేయమన్నట్లుగా’ ఉందని ఎద్దేవా చేశారు.
ఓటర్ల వివరాల్లో ఏవైనా సాంకేతిక లోపాలు, తప్పులు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలో సరిదిద్దాలే తప్ప, దేశ మాజీ ఉపప్రధాని ఎల్.కె. అద్వానీ, ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వంటి అత్యున్నత ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేయడం ఏ రకమైన ప్రక్షాళన అని ఆయన నిలదీశారు.
పేర్లలో చిన్నపాటి స్పెల్లింగ్ పొరపాట్లు, వివాహానంతరం మహిళల ఇంటిపేర్లు మారడం వంటి అత్యంత సహజమైన అంశాలను కూడా పెద్ద సమస్యలుగా చిత్రీకరించడం, తాతముత్తాతల పుట్టిన తేదీలను వెతకాలంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం విడ్డూరంగా ఉందని నారాయణ మండిపడ్డారు. దేశంలో ఉన్న కోట్లాది మంది ఓటర్ల హక్కుల పరిరక్షణ విషయంలో ఎన్నికల సంఘం అత్యంత పారదర్శకంగా, రాజ్యాంగబద్ధమైన నిష్పక్షపాతంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయం నడిపించే ఒక ‘సురభి నాటకం’లో స్వయంప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ అపవిత్రమైన పావుగా మారకూడదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.