ధైర్యంగా పోరాడదామని సీఎం రేవంత్ చెప్పారు: దానం నాగేందర్
- పార్టీ ఫిరాయింపుల కేసులో దానంపై అనర్హత వేటు వేసిన హైకోర్టు
- సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని వ్యాఖ్య
- ఉపఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్న దానం
పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానం నాగేశ్వర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పును తాను సమగ్రంగా చదివానని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులపై వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా? వద్దా? అనేది పూర్తిగా అసెంబ్లీ స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయమని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలిపిన దానం నాగేందర్... సీఎం తనను 'నువ్వు ఫైటర్‌వి, ధైర్యంగా పోరాడదాం' అని ప్రోత్సహించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్నికలు తనకు కొత్తేమీ కాదని, నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయి పోరాటాలు చేయడానికి, ఉపఎన్నికలను ఎదుర్కోవడానికి తాము, తమ పార్టీ కేడర్ సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.