వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించారు: కిషన్ రెడ్డి

వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించారు: కిషన్ రెడ్డి

YS Rajasekhara Reddy KCR encouraged party defections excessively says Kishan Reddy
  • పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపెట్టు అన్న కిషన్ రెడ్డి
  • గతంలో సబిత, తలసాని రాజీనామా చేయకుండానే కేసీఆర్ వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని మండిపాటు
  • భూదందాలు, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయని విమర్శ

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రికిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన... ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్య సూత్రాలను పక్కనబెట్టి ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించారని ఆరోపించారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే మంత్రి పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని, బీజేపీ శ్రేణులు జరిపిన నిరంతర న్యాయపోరాటం వల్లే ఆయనపై అనర్హత వేటు ముప్పు వచ్చిందని స్పష్టం చేశారు.


కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రెండూ భూదందాలు, అవినీతిలోనే పోటీపడుతున్నాయని... 'దోచుకోవడం-దాచుకోవడం' తప్ప ప్రజాక్షేమం పట్టడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు వారిపై ఏలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా 'మ్యాచ్ ఫిక్సింగ్' రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇరు పార్టీలు పరస్పరం నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఏ ఎన్నికలకైనా బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Advertisement
G Kishan Reddy
Telangana High Court
Party Defections
BRS Congress
Danam Nagender
Telangana Politics

More Telugu News