విజయసాయి నీతులు చెప్పడమా? చిత్తశుద్ధి ఉంటే జగన్‌పై అప్రూవర్‌గా మారాలి: వర్ల రామయ్య

విజయసాయి నీతులు చెప్పడమా? చిత్తశుద్ధి ఉంటే జగన్‌పై అప్రూవర్‌గా మారాలి: వర్ల రామయ్య

Vijayasai Reddy should become an approver against Jagan if he is sincere says Varla Ramaiah
  • విజయసాయి రెడ్డి 'అవినీతి రహిత పాలన' అనడంపై వర్ల రామయ్య ధ్వజం
  • జగన్ అవినీతి నిజంగా తప్పనిపిస్తే అప్రూవర్‌గా మారాలని డిమాండ్
  • 12 ఛార్జ్‌షీట్లలో నిర్దోషిగా తేలిన తర్వాతే ప్రజల్లోకి రావాలని సవాల్
  • చంద్రబాబు తెలుగు జాతి సంపద అని, జగన్‌తో పోల్చొద్దని హితవు
  • 'మూడో ప్రత్యామ్నాయం' అనేది ఉనికి కోసం ఆడుతున్న నాటకమని విమర్శ
జగన్ అవినీతి కేసుల్లో ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి 'అవినీతి రహిత పాలన', 'మూడో ప్రత్యామ్నాయం' అంటూ నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రూ.43 వేల కోట్ల ప్రజాధనం లూటీ కేసుల్లో జగన్‌తో పాటు సహ నిందితుడిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు జగన్ అవినీతిని పరోక్షంగా తప్పుబడుతున్నారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీబీఐ కేసుల్లో 'అప్రూవర్'గా మారి జగన్‌కు శిక్ష పడేలా చేయాలని సూటి సవాల్ విసిరారు. శుక్రవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ విజయసాయి రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు.

"జగన్ తో కలిసి అడుగడుగునా అవినీతికి పాల్పడి, సీబీఐ చేతిలో అరెస్ట్ అయి, చంచల్‌గూడ జైల్లో 16 నెలలు సహ ఖైదీగా గడిపిన చరిత్ర విజయసాయి రెడ్డిది. గతంలో మాయమాటలతో జగన్‌ను గద్దెనెక్కించి, ఐదేళ్ల పాటు ఆయన వెనకుండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో ప్రధాన సూత్రధారి ఈయనే. ఇప్పుడు అదంతా మరిచిపోయి 'మూడో ప్రత్యామ్నాయం' తెస్తాననడం సిగ్గుచేటు. 12 సీబీఐ ఛార్జ్‌షీట్లలో నిందితుడిగా ఉండి, 12 ఏళ్లుగా కోర్టు విచారణకు హాజరుకాకుండా వాయిదాలు వేయిస్తున్న వ్యక్తి, స్వేచ్ఛగా తిరుగుతూ రాజకీయం మాట్లాడటం చూస్తే న్యాయవ్యవస్థ ఎంత సరళంగా ఉందో అర్థమవుతోంది" అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

నాడు జగన్‌ను తయారుచేసి.. ఇప్పుడు యువతను ఉద్ధరిస్తారా?

అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు 'మెరికల్లాంటి యువతను తెస్తాం' అనడం హాస్యాస్పదంగా ఉందని వర్ల రామయ్య విమర్శించారు. "అవినీతి రహిత యువతను తయారు చేస్తానంటున్న విజయసాయికి ఆ అర్హత ఎక్కడిది? గతంలో మీరు తయారు చేసింది జగన్మోహన్ రెడ్డినే కదా? ఆయన అవినీతికి 'ఓం' అని దిద్దింది మీరే. మీ చార్టర్డ్ అకౌంటెంట్ నైపుణ్యాన్ని రాష్ట్రాన్ని లూటీ చేసేందుకే ఉపయోగించి, జగన్‌ను ఒక పెద్ద 'అవినీతి సామ్రాట్'గా తీర్చిదిద్దారు. 

జగన్ లాంటి ప్రొడక్ట్‌ను తయారుచేసిన వ్యక్తి నుంచి వచ్చే యువత ఎలా ఉంటారు? మీ కొత్త పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమను 'రతనాల సీమ' చేస్తామంటున్నారు. మరి ఐదేళ్లు అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఏం చేశారు? మీ అసమర్థత వల్లే సీమ వెనుకబడిందనే నిజం ప్రజలకు తెలియదా?" అని వర్ల రామయ్య ప్రశ్నించారు. "రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్ని కాపాడుతాం" అని మాట్లాడటంపై మండిపడుతూ, "అంటే మీ ఉద్దేశంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన జగన్ ఒరిజినల్ రెడ్డి కాదా? ఆయన దొంగ రెడ్డా?" అని నిలదీశారు.

నిర్దోషిగా తేలాకే ప్రజల్లోకి రా!

విజయసాయి రెడ్డికి నిజంగా ప్రజల్లోకి రావాలని ఉంటే, ముందు తనపై ఉన్న 12 ఛార్జ్‌షీట్లలో నిర్దోషిగా బయటకు రావాలని వర్ల రామయ్య సవాల్ విసిరారు. "కోర్టుకు వెళ్లి నా కేసులను రోజువారీ విచారించి, నన్ను నిర్దోషిగా ప్రకటించమని తీర్పు తెచ్చుకో. అప్పుడు ప్రజల్లోకి వస్తే నిన్ను నమ్మే అవకాశం ఉంటుంది. అంతేకానీ, తీవ్రమైన అవినీతి ముద్రతో ప్రజలను మోసం చేయాలని చూస్తే కుదరదు" అని స్పష్టం చేశారు.

చంద్రబాబు తెలుగు జాతి సంపద

చంద్రబాబు తెలుగు జాతి గర్వించదగ్గ మహా సంపద అని, ఆయనతో జగన్, విజయసాయి వంటి వారిని పోల్చడం సిగ్గుచేటని వర్ల రామయ్య అన్నారు. "2019లో చంద్రబాబు గారే సీఎంగా కొనసాగి ఉంటే, ఈపాటికి ఏపీ గుజరాత్‌తో పోటీపడేది. కానీ మీరు తయారుచేసిన అవినీతి డైనోసార్ వల్ల రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచాలని తపించే చంద్రబాబు ఎక్కడ? అవినీతిలో పుట్టి, అవినీతిలో పెరిగిన జగన్ ఎక్కడ? చంద్రబాబు విశ్వసనీయత చూసే నేడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. వరదలో కొట్టుకుపోయేవాడు గడ్డిపరకను పట్టుకున్నట్లు, ఉనికి కోసం విజయసాయి రెడ్డి 'మూడో ప్రత్యామ్నాయం' నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు గారి ప్రజా పాలనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు" అని వర్ల రామయ్య హెచ్చరించారు.
Advertisement
Vijayasai Reddy
Varla Ramaiah
YS Jagan Mohan Reddy
TDP vs YSRCP
Andhra Pradesh Politics
CBI Corruption Cases

More Telugu News