ప్రియుడిని రాడ్‌తో కొట్టి, యాసిడ్ పోసి చంపిన ప్రియురాలు
- విజయనగరం జిల్లా కందిపేటలో దారుణ ఘటన
- బావ కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ
- కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు
విజయనగరం జిల్లాలోని కందిపేటలో దారుణ ఘటన వెలుగు చూసింది. సహజీవనం చేస్తున్న ఇద్దరి మధ్య తలెత్తిన తీవ్ర మనస్పర్థలు చివరకు ప్రియుడి దారుణ హత్యకు దారితీశాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ దాడిలో ప్రియురాలు ఇనుప రాడ్‌తో దాడి చేయడమే కాకుండా, యాసిడ్ పోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. భర్తకు దూరంగా ఉంటున్న దనాల రాములమ్మ అనే మహిళ, తన బావ కుమారుడైన దనాల శ్రీనుతో సన్నిహితంగా ఉంటోంది. శ్రీనుకు కూడా వివాహమై భార్య ఉన్నప్పటికీ, ఆమెను విడిచిపెట్టి కొంతకాలంగా రాములమ్మతో కలిసి సహజీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున వీరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన రాములమ్మ ఒక్కసారిగా ఇనుప రాడ్‌తో శ్రీను తలపై బలంగా బాదడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆపై అతడి శరీరంపై యాసిడ్ పోయడంతో తీవ్ర గాయాలైన శ్రీను ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, రాములమ్మను అదుపులోకి తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.