ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ వేతన పరిమితి రూ.25,000కు పెంపు

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ వేతన పరిమితి రూ.25,000కు పెంపు

EPFO PF wage limit increased to 25000 for employees
  • తాజా నిర్ణయంతో 51 లక్షల మందికిపైగా ఉద్యోగులకు ప్రయోజనం
  • రూ.15 వేల-రూ.25 వేల వేతన ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి
  • పీఎఫ్‌తో పాటు పెన్షన్‌, బీమా రక్షణ అందుబాటులోకి
  • కేంద్రంపై ఏటా రూ.11,339 కోట్ల భారమని అంచనా
  • ఈపీఎఫ్‌ఓలో ప్రస్తుతం 7.98 కోట్ల మంది చందాదారులు
ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత విస్తరించే కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలో తప్పనిసరి పీఎఫ్‌ కవరేజీకి ఉన్న నెలవారీ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో అదనంగా 51 లక్షల మందికిపైగా ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి రానున్నారు.

ప్రస్తుతం నెలకు రూ.15 వేలకుపైగా వేతనంతో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఈపీఎఫ్‌ పరిధిలో తప్పనిసరి కవరేజీ ఆటోమేటిక్‌గా ఉండదు. దీంతో పీఎఫ్‌, పెన్షన్‌, సంబంధిత బీమా రక్షణకు వారు దూరంగా ఉండే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం పొందే ఉద్యోగులు తప్పనిసరి సామాజిక భద్రత పరిధిలోకి వస్తారు.

కొత్త పరిమితి వల్ల ఉద్యోగులకు పీఎఫ్‌ పొదుపుతో పాటు ఉద్యోగుల పెన్షన్‌ పథకం (ఈపీఎస్‌) కింద పెన్షన్‌ రక్షణ లభిస్తుంది. ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పథకం (ఈడీఎల్‌ఐ) కింద బీమా రక్షణ కూడా అందుతుంది. ఇవన్నీ సంబంధిత పథకాల నిబంధనలకు లోబడి ఉంటాయి.

ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.11,339 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతం అందిస్తున్న వార్షిక బడ్జెట్‌ సాయం సుమారు రూ.10,250 కోట్లు. ఐదేళ్లలో మొత్తం వ్యయం దాదాపు రూ.56,696 కోట్లుగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదనపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరిగాయి. జూన్‌ 16న జరిగిన వ్యయ ఆర్థిక కమిటీ సమావేశంలోనూ దీనికి సంబంధించి ప్రతిపాదన వచ్చింది. 

2004 నుంచి 2014 వరకు పీఎఫ్‌ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. 2014 సెప్టెంబరులో దాన్ని రూ.15 వేలకు పెంచారు. గత కొన్నేళ్లుగా వేతనాలు, ఆదాయాలు పెరగడం, అధికారిక ఉద్యోగాలు విస్తరించడంతో తాజాగా పరిమితిని రూ.25 వేలకు పెంచినట్లు కేంద్రం తెలిపింది.

ఈపీఎఫ్‌ఓ ప్రస్తుతం ఈపీఎఫ్‌, ఈపీఎస్‌, ఈడీఎల్‌ఐ పథకాలను నిర్వహిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం సుమారు 7.98 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. దాదాపు 7.68 లక్షల సంస్థలు ఈపీఎఫ్‌ఓకు చందాలు చెల్లిస్తున్నాయి. ఈపీఎస్‌ కింద సుమారు 82 లక్షల మంది పెన్షన్‌ పొందుతున్నారు. ఈడీఎల్‌ఐ పథకం ఈపీఎఫ్‌ సభ్యత్వానికి అనుసంధానంగా బీమా రక్షణ కల్పిస్తుంది.
Advertisement
EPFO
PF wage limit increase
Central Government employees news
Employees Provident Fund
EPS pension scheme
Narendra Modi cabinet decisions

More Telugu News