యూపీఐ, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌.. ఏది వాడితే అదనపు ఛార్జీ ఉండదు?

యూపీఐ, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌.. ఏది వాడితే అదనపు ఛార్జీ ఉండదు?

UPI Credit Card Net Banking which one has no extra charges
  • యూపీఐ ఎండీఆర్‌ కస్టమర్‌ చెల్లించాల్సినది కాదు
  • క్రెడిట్‌ కార్డు ఎండీఆర్‌ సాధారణంగా వ్యాపారిదే
  • నెట్‌ బ్యాంకింగ్‌లో కొన్ని బదిలీలు ఉచితం
  • ప్లాట్‌ఫామ్‌ ఫీజు పేమెంట్‌ విధానానికి వేరుగా ఉండొచ్చు
  • క్రెడిట్‌ కార్డు బకాయిపై వడ్డీ పడొచ్చు
ఆన్‌లైన్‌లో ఏదైనా కొనేటప్పుడు పేమెంట్‌ ఆప్షన్లు చాలానే కనిపిస్తాయి. యూపీఐ.. క్రెడిట్‌ కార్డు.. నెట్‌ బ్యాంకింగ్‌.. ఇలా ఏది ఎంచుకున్నా చెల్లింపు పూర్తవుతుంది. కానీ ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తోంది. యూపీఐపై ఎండీఆర్‌ అమల్లోకి వస్తే ఆ భారం మనపైనా పడుతుందా? మరి క్రెడిట్‌ కార్డుతో చెల్లిస్తే ఎండీఆర్‌ ఉంటుందా? నెట్‌ బ్యాంకింగ్‌ పరిస్థితి ఏంటి? అసలు వినియోగదారుడి జేబు నుంచి అదనంగా డబ్బులు ఎప్పుడు వెళతాయి? ఇదే తెలుసుకోవాల్సిన విషయం.

యూపీఐలో కస్టమర్‌పై భారం ఉండదు
అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000 దాటిన కొన్ని వ్యాపార యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌ అమల్లోకి వస్తుంది. అయితే ఇది వ్యాపారి చెల్లించాల్సిన రుసుము. కస్టమర్‌ నుంచి వసూలు చేయకూడదు. ఉదాహరణకు మీరు దుకాణంలో రూ.10,000 విలువైన వస్తువు కొని యూపీఐతో చెల్లిస్తే.. మీ ఖాతా నుంచి రూ.10,000 మాత్రమే వెళుతుంది. మరో రూ.40 ఎండీఆర్‌ పేరుతో కట్‌ చేయరు. రూ.75,000 దాటిన లావాదేవీల్లోనూ ఎండీఆర్‌ గరిష్ఠంగా రూ.300కే పరిమితం. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ బదిలీలకు ఈ ఛార్జీ వర్తించదు.

క్రెడిట్‌ కార్డులోనూ ఎండీఆర్‌ కస్టమర్‌ది కాదు
క్రెడిట్‌ కార్డుతో చెల్లించినప్పుడు కూడా ఎండీఆర్‌ వర్తిస్తుంది. అయితే అది కూడా వ్యాపారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10,000 విలువైన వస్తువు కొంటే.. కార్డు నుంచి సాధారణంగా రూ.10,000నే చెల్లిస్తారు. వ్యాపారి కార్డు చెల్లింపును స్వీకరించినందుకు ఎండీఆర్‌ చెల్లిస్తాడు. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని సేవలు లేదా ప్లాట్‌ఫామ్‌లు కార్డు చెల్లింపుపై ప్రత్యేక ఫీజు విధించవచ్చు. అంతేకాదు.. క్రెడిట్‌ కార్డు బిల్లును గడువులోగా పూర్తిగా చెల్లించకపోతే వడ్డీ, ఆలస్య రుసుములు పడొచ్చు. అవి ఎండీఆర్‌ కాదు. 

నెట్‌ బ్యాంకింగ్‌లో లెక్క ఏంటి?
నెట్‌ బ్యాంకింగ్‌ విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. సేవింగ్స్‌ ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో చేసే ఎన్‌ఈఎఫ్‌టీ బదిలీకి బ్యాంకు ఛార్జీ ఉండకపోవచ్చు. కానీ టికెట్‌ బుకింగ్‌ లేదా ఆన్‌లైన్‌ కొనుగోలు సమయంలో నెట్‌ బ్యాంకింగ్‌ను ఎంచుకుంటే.. ఆ ప్లాట్‌ఫామ్‌ ప్రత్యేకంగా పేమెంట్‌ లేదా సర్వీస్‌ ఫీ వసూలు చేయొచ్చు. ఇదే విషయం యూపీఐ, క్రెడిట్‌ కార్డులకూ వర్తిస్తుంది. పేమెంట్‌ విధానం ఉచితం అయినా.. బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వేరే ఛార్జీ వేయొచ్చు. అందుకే పేమెంట్‌ చేసే ముందు చివరి పేజీలో కనిపించే చెల్లింపు మొత్తం ఎంత అనేది చూడటం ముఖ్యం.

మన జేబు నుంచి అదనపు డబ్బు ఎప్పుడు పోతుంది?
ఇక్కడే ఎండీఆర్‌, వినియోగదారుడి ఛార్జీ మధ్య తేడా అర్థం చేసుకోవాలి. ఎండీఆర్‌ అనేది వ్యాపారి చెల్లించే ఖర్చు. కన్వీనియన్స్‌, బుకింగ్‌, ప్లాట్‌ఫామ్‌ ఫీజు వంటివి కస్టమర్‌పై పడే వేర్వేరు ఛార్జీలు కావచ్చు. ఉదాహరణకు ఒక విమాన టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు యూపీఐ ఎంచుకున్నా, క్రెడిట్‌ కార్డు ఎంచుకున్నా ఒకే కన్వీనియన్స్‌ ఫీజు పడొచ్చు. మరో వెబ్‌సైట్‌లో యూపీఐకి ఫీజు లేకపోయి.. నెట్‌ బ్యాంకింగ్‌కు రూ.10 ఛార్జీ ఉండొచ్చు. కాబట్టి “యూపీఐ చౌక.. క్రెడిట్‌ కార్డు ఖరీదు.. నెట్‌ బ్యాంకింగ్‌ ఉచితం” అని ఒకే మాటలో చెప్పలేం. పేమెంట్‌ చేసే ముందు చివరగా మనం చెల్లించాల్సిన మొత్తం ఎంత? అదనపు ఫీజు ఏమైనా ఉందా? అన్నదే చూడాలి.
Advertisement
UPI
Credit Card Charges
Net Banking Fees
MDR Charges
Digital Payments
Online Transaction Fees

More Telugu News