అమెరికాలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు బ్రేక్‌!

అమెరికాలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు బ్రేక్‌!

Donald Trump student visa restriction blocked by US federal court
  • నాలుగేళ్ల విద్యార్థి వీసా పరిమితిపై అమెరికా కోర్టు స్టే
  • ట్రంప్‌ ప్రభుత్వ నిబంధన అమలును తాత్కాలికంగా అడ్డుకున్న న్యాయమూర్తి
  • కొత్త నిబంధన అమల్లోకి వస్తే నాలుగేళ్లు దాటితే అనుమతి తీసుకోవాల్సి వచ్చేది
  • పీహెచ్‌డీ విద్యార్థులపై ప్రభావం ఎక్కువగా ఉండేది
  • నిబంధనను ప్రభుత్వం అప్పీల్‌ చేసే అవకాశం
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను నాలుగేళ్లకే పరిమితం చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన అమలును ఫెడరల్‌ కోర్టు తాత్కాలికంగా అడ్డుకుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు కూడా ప్రయోజనం కలగనుంది.

బోస్టన్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి ఎఫ్‌. డెన్నిస్‌ సేలర్‌ సోమవారం దేశవ్యాప్తంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధన మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా ఈ ఆదేశాలు వచ్చాయి.

ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు తమ కోర్సు కొనసాగుతున్నంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే నాలుగేళ్లకు మించి చదువు కొనసాగించాల్సిన వారు ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. కోర్సు మార్చడం, మరో విశ్వవిద్యాలయానికి మారడం, అదే స్థాయిలో మరో డిగ్రీ చేయడం కూడా అనుమతితోనే సాధ్యమయ్యేది.

ప్రభుత్వం జాతీయ భద్రత కారణంగా నిబంధనల్లో మార్పులు అవసరమని వాదించింది. అయితే ప్రభుత్వం చెప్పిన కారణాలు బలహీనంగా ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కొత్త నిబంధన అమలైతే అమెరికా విశ్వవిద్యాలయాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

ముఖ్యంగా పీహెచ్‌డీ విద్యార్థులపై ప్రభావం ఎక్కువగా ఉండేదని కోర్టు పేర్కొంది. నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ గణాంకాల ప్రకారం అమెరికాలో డాక్టోరల్‌ కోర్సులు పూర్తయ్యేందుకు సుమారు 5.7 ఏళ్లు పడుతున్నాయి.

విదేశీ విద్యార్థులు, పరిశోధకులపై పరిమితులు పెడితే అమెరికాకు నష్టం కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. దాదాపు 22 వేల మంది కొత్త నిబంధనపై అభిప్రాయాలు పంపగా.. ఎక్కువ మంది వ్యతిరేకించారు. తదుపరి విచారణ అక్టోబర్‌ 2న జరగనుంది.
Advertisement
Donald Trump
US Student Visa
Indian Students in USA
F1 Visa Rule
US Federal Court
International Students

More Telugu News