బిర్యానీ ప్రకటనలో గణపతి.. యజమాని అరెస్ట్

బిర్యానీ ప్రకటనలో గణపతి.. యజమాని అరెస్ట్

Lord Ganesha in Biryani Advertisement Shop Owner Arrested
  • మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంఘాల ఆగ్రహం
  • బ్యానర్ తొలగించి, యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • వినాయక చవితి సందర్భంగా చికెన్ బిర్యానీ ఆఫర్ ఇవ్వడంతో ఘటన
  • తిరునల్వేలిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రమోషనల్ బ్యానర్ తీవ్ర వివాదానికి దారితీసింది. చికెన్ బిర్యానీ ప్రకటనలో గణేశుడి చిత్రాన్ని వాడటంతో మత మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఫిర్యాదులపై తమిళనాడు పోలీసులు ఓ బిర్యానీ షాపు యజమానిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తిరునల్వేలిలో చోటుచేసుకుంది.

తిరునల్వేలి-తిరుచెందూర్ ప్రధాన రహదారిలోని వీఎం ఛత్రం సమీపంలో ఉన్న ఓ బిర్యానీ షాపు వద్ద ఈ వివాదాస్పద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 13, 14 తేదీల్లో రూ. 99కే ‘అరబిక్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ’ అందిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఈ బ్యానర్‌పై గణేశుడు బిర్యానీ వండుతున్నట్లు లేదా తింటున్నట్లుగా చిత్రాన్ని ముద్రించారు.

ఈ బ్యానర్‌ను గమనించిన స్థానికులు, హిందూ మున్నాని సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మత మనోభావాలను కించపరచడమేనని ఆరోపిస్తూ షాపు వద్ద గుమిగూడి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బ్యానర్‌ను తొలగించారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రకటనలు ఇవ్వొద్దని యజమానిని హెచ్చరించారు.

అనంతరం సెల్వరాజ్ (42) అనే వ్యక్తి తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, షాపు యజమాని జయంత్ (30)ను ఆదివారం అరెస్ట్ చేశారు.  
Advertisement
Lord Ganesha
Biryani Ad Controversy
Tirunelveli Police
Tamil Nadu News
Religious Sentiments
Shop Owner Arrested

More Telugu News