యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.2000 వరకు లావాదేవీలు ఉచితం!

యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.2000 వరకు లావాదేవీలు ఉచితం!

UPI users get good news as transactions up to 2000 rupees are free
  • రూ.2000 వరకు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఉండవన్న కేంద్రం
  • రూపే డెబిట్ కార్డు చెల్లింపులకు కూడా ఈ నిబంధన వర్తింపు
  • అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • చెల్లింపులు చేసే, స్వీకరించే వారిపై ఛార్జీలు విధించరాదని ఆదేశం
దేశవ్యాప్తంగా కోట్లాది మంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2,000 వరకు జరిపే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరాదని స్పష్టం చేసింది. ఇదే నిబంధన రూపే ఆధారిత డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకు కూడా వర్తిస్తుందని పేర్కొంటూ సోమవారం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏ కింద ఈ మార్పులను నోటిఫై చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, రూ.2,000 వరకు చేసే యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు గానీ, ఇతర పేమెంట్ సంస్థలు గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. ఈ విధానాల్లో డబ్బులు పంపే వారిపైనా, స్వీకరించే వారిపైనా ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది.

ఇటీవల యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించవచ్చనే ప్రచారం జరగడంతో వినియోగదారులలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. వ్యక్తిగత (పీ2పీ) యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని గత నెలలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. భవిష్యత్తులో వ్యాపారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించినా అది కూడా నిర్ణీత పరిమితి దాటిన లావాదేవీలకు మాత్రమే, నామమాత్రంగా ఉంటుందని తెలిపింది. ఆ ఛార్జీలు కూడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఉన్న ఛార్జీల కంటే చాలా తక్కువగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
Advertisement
UPI
RuPay Debit Card
Finance Ministry
Digital Payments
Transaction Charges
Gazette Notification

More Telugu News